నవరత్నాల వల్లే అష్ట కష్టాలు.. అనుభవం లేకపోవడమే పార్టీ దీనస్థితికి కారణమా?

Reddy P Rajasekhar
2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలు కావడానికి నవరత్నాలే కారణమని చెప్పవచ్చు. 2019 ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో ఊహించని స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి వైసీపీ అధికారంలోకి రాగా 2024 ఎన్నికల్లో వైసీపీని మించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది.
 
జగన్ కు 2019కు ముందు ఎంపీగా, ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నా వేటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? వేటికి ఇవ్వకూడదు? అనే అంశాలను బేరీజు వేసుకునే విషయంలో జగన్ ఫెయిల్ అయ్యారనే చెప్పవచ్చు. 2024 ఎన్నికలకు ముందు జగన్ మేనిఫెస్టోను ప్రకటించిన రోజునే వైసీపీ ఓటమిని ఆ పార్టీ నేతలు ఫిక్స్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు సైతం వైసీపీ నేతలను పెద్దగా ఆశ్చర్యపరచలేదు.
 
రుణమాఫీ లాంటి సాధ్యం కాని హామీలు ఇవ్వలేనని చెప్పిన జగన్ కనీసం కూటమికి పోటీ ఇచ్చే తరహా హామీలను సైతం ఇవ్వడంలో విఫలమయ్యారు. ఫలితాలు వెలువడిన తర్వాత కూడా పార్టీ నేతలను ఉత్సాహపరిచేలా జగన్ ఎలాంటి నిర్ణయాలను ప్రకటించలేదు. నవరత్నాల వల్లే జగన్ కు ఇప్పుడు అష్టకష్టాలు మొదలయ్యాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
రాయలసీమ వైసీపీకి కంచుకోట కాగా ఈ ఎన్నికల ఫలితాలు ఆ అభిప్రాయాన్ని సైతం మార్చేశాయి. జగన్ సీమ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని సైతం కోల్పోయారు. సరైన, ప్రతిభ ఉన్న సలహాదారుల సలహాలు తీసుకుని జగన్ ముందడుగులు వేస్తే మాత్రమే 2029లో అయినా వైసీపీకి అధికారం సొంతమవుతుంది. 2029 నాటిని వైసీపీకి వరుస షాకులు తగిలేలా టీడీపీ ప్రణాళికలు ఉన్నాయి. వైసీపీ ప్రజల అభిప్రాయాన్ని సైతం సేకరించి ఓటమికి వాస్తవ కారణాలను తెలుసుకుంటే మంచిది. వాస్తవాలను మరిచి వైసీపీ అడుగులు వేస్తే మాత్రం రాబోయే రోజుల్లో పార్టీకి మరిన్ని షాకులు ఖాయమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: