కూటమి మోజులో పడి బాబు వారిని మరిచారా? కనీసం నామినేటెడ్ పోస్టులైనా దక్కేనా?

Suma Kallamadi
* పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పోస్టులు  
* త్వరలోనే వారిని గుర్తించి మంచి పదవుల్లో నియామకం  
* వారిని మాత్రం మారుస్తారా
( ఏపీ - ఇండియా హెరాల్డ్)
2019లో వైస్సార్సీపీ చేతిలో ఘోర పరాజయం చవి చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2024 తాజా ఎన్నికల్లో మాత్రం చాణక్య రాజనీతిని అవలంబించారు. ఈ క్రమంలో ఏర్పాటైన టీడీపీ కూటమి చేతిలో వైస్సార్సీపీ తుక్కు తుక్కు కింది ఓడిపోయింది. కట్ చేస్తే ముఖ్యమంత్రిగా, విపక్షనేతగా సుధీర్ఘ కాలం పనిచేసిన చంద్రబాబు మరలా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయడం వలన ఒకవైపు జనసేనకు, మరోవైపు బీజేపీకి బాబు సీట్లు సర్దుబాటు చేయడంతో అప్పటికీ టీడీపీ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డ కొంతమంది నేతలకు సీట్లు దక్కకపోవడంతో వారి రాజకీయ జీవితం అగమ్యగోచరంగా తయారయింది.
ఈ నేపథ్యంలోనే సీట్లు దక్కని నేతల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటారని అంతా అనుకున్నారు. అయితే ఆ సమయం ఇపుడు రానే వచ్చింది. త్వరలో టీడీపీ కూటమికోసం కష్టపడ్డ సో కాల్డ్ నేతల విషయమై బాబు ఓ సమావేశం ఏర్పాటు చేసి నామినేటెడ్ పదవులను కొన్నిటిని వారి కేటాయించనున్నారు. ఐతే అవి ఎవరికి దక్కుతాయో అన్నది మాత్రం ఇపుడు ప్రశ్నర్ధకంగా మారింది. ఇకపోతే ఎన్నికలకు ముందు బాబు టికెట్ దక్కని పలువురు సీనియర్ నేతలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చినట్టు కొట్టొచ్చినట్టు కనబడింది.
ఉదాహరణకి కొవ్వూరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే రెడ్డి సుబ్రమణ్యంను టీడీపీ పొలిట్ బ్యూరోలోకి, గండి బాబ్జీని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగాను, అలాగే హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ రాముడు, టీడీపీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్‌, మన్నె సుబ్బారెడ్డిని చంద్రబాబు నియమించడం జరిగింది. అయితే మాజీ మంత్రి కేఎస్ జవహర్ కొవ్వూరు టికెట్ ఆశించగా.. ఈసారి ఆయనకు నిరాశ ఎదురైంది. ఆ స్థానంలో ముప్పిడి వెంకటేశ్వరరావుకు అవకాశం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో జవహర్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు సిద్ధపడగా.. టీడీపీ అధిష్టానం ఆయన్ని ఎన్నికలకు ముందు మెత్తబడేలా చేసింది. అలాగే రెడ్డి సుబ్రమణ్యం రామచంద్రాపురం టికెట్ ఆశించగా ఆయనకు కూడా నిరాశే ఎదురైంది. గండి బాబ్జీ విశాఖ దక్షిణం టికెట్ ఆశించగా.. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఇన్ని పరిణామాల తరువాత టీడీపీ తాజా ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. అయితే మంత్రులు, ఉప మంత్రులు ప్రకటించిన తరువాత త్వరలో జరగబోతున్న నామినేటెడ్ పోస్టుల విషయంలో బాబు పార్టీ కోసం కష్టపడ్డ నేతల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇపుడు చాలా ఆసక్తికర అంశంగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: