నేడే అసెంబ్లీ.. ప్రజాతీర్పును జగన్ గౌరవించాల్సిందే.. హుందాగా కనిపిస్తూ మెప్పు పొందాల్సిందే!

Reddy P Rajasekhar
రాజకీయాలలో ఓడలు బండ్లు కావడం బండ్లు ఓడలు కావడం సాధారణంగా జరుగుతుంది. జగన్ విషయంలో సైతం అదే జరిగింది. 2019 ఎన్నికల్లో సంచలన ఫలితాలను సాధించిన జగన్ 2024 ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేకపోయారు. కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో సైతం వైసీపీకి దారుణమైన ఫలితాలు సొంతమయ్యాయి. సొంత జిల్లా కడపలో సైతం వైసీపీ ఉనికి ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి నెలకొంది.
 
జగన్ మారాల్సిన అవసరం ఉంది. సంక్షేమం మాత్రమే సరిపోదని అభివృద్ధిని సైతం ప్రజలు కోరుకుంటున్నారని భావించాల్సి ఉంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ధీటుగా కౌంటర్లు ఇవ్వాల్సి ఉంది. మీడియా ముందుకు వస్తూ మీడియా ప్రశ్నలకు ధైర్యంగా సమాధానం ఇస్తూ మళ్లీ ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేయాల్సి ఉంది. 10 శాతం ఓట్ల తేడాతో ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది.
 
అయితే ఆ 10 శాతం ఓట్లు ఎందుకు రాలేదనే జగన్ తనను తాను ప్రశ్నించుకోవడంతో పాటు తప్పులను సరిదిద్దుకుంటూ ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. జగన్ కు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో సాధారణ ఎమ్మెల్యేగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ సమావేశాల్లో హుందాగా ఉంటూ జగన్ టీడీపీ ఇచ్చిన హామీల గురించి ఏపీ అభివృద్ధి గురించి ప్రశ్నించాల్సి ఉంది.
 
జులై నెల 1వ తేదీన జీతాలు, పింఛన్ల కోసం టీడీపీ 10 వేల కోట్ల రూపాయల అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మిగతా పథకాలను సైతం అమలు చేయాలంటే టీడీపీ ఎంత ఖర్చు చేయాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2029లో వైసీపీదే అధికారం అంటూ జగన్ ప్రగల్భాలు పలకడం మానేసి వాస్తవ పరిస్థితులను గమనిస్తూ ముందడుగులు వేస్తే వైసీపీకి ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. బీరాలు పలకడం వల్ల పార్టికి నష్టమే తప్ప లాభం ఉండదని జగన్ గమనించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: