ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రుల ప్రమాణ స్వీకారం, శాఖల కేటాయింపు చకచకా పూర్తయ్యాయి.చంద్రబాబు బాధ్యతలను స్వీకరించిన వెంటనే అయిదు గ్యారంటీలపై సంతకాలూ చేశారు.ఇక ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 21, 22వ తేదీల్లో అసెంబ్లీని సమావేశ పర్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన 175 మందీ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
రేపు బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా ఈ నెల 21 నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రతిపక్ష నేత వరకు, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించనున్నారు.అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ నెల 22న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం కానున్నారు.
ప్రొటెం స్పీకర్ పదవిపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ నాకు వచ్చింది పెద్ద పదవి కాదని రెండు రోజుల పాటు కొత్త సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయిస్తే అయిపోతుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అయినా అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి అని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడంపై గోరంట్ల బుచ్చయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒకటేనని, అందరినీ సమానంగా చూస్తామని అన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యులను సమానంగా గౌరవస్తామని చెప్పారు.అసెంబ్లీలో సీనియర్ సభ్యుడిని కావడం వల్ల ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు తనను కోరారని, దీనికి అంగీకరించానని చెప్పారు.
అలా అందరినీ సమానంగా చూడటం, గౌరవంగా వ్యవహరించడం వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రభుత్వం వల్ల కాలేదని గోరంట్ల విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో శాసన సభ సజావుగా సాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఓ చక్కటి వేదిక అవుతుందని పేర్కొన్నారు.గత ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, మైకులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని గోరంట్ల అన్నారు. ప్రస్తుతం బలమైన ప్రతిపక్షం లేదని, ఉన్నవాళ్లయినా సక్రమంగా సభకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ సభ్యులు నిర్మాణాత్మక విమర్శలు చేయవచ్చని, వాటిని స్వీకరిస్తామని అన్నారు.
ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 164 ఎమ్మెల్యేలు విజయం సాధించగా వైసీపీ తరపున 11 మంది శాసన సభ్యులుగా ఎన్నికైయ్యారు. వీరందరు శుక్రవారం నాడు రాష్ట్ర అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.