సొంత ప్రభుత్వం పైనే తీవ్ర విమర్శలు చేసిన హనుమంతరావు.. ఏమన్నారంటే...??

Suma Kallamadi
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు సొంత ప్రభుత్వం పైనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? లేదా దోపిడి రాజ్యమా అన్నట్టు మాట్లాడారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చినా పేదలకు న్యాయం జరగడం లేదు అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆయన తానున్న పార్టీ మీదనే ఇలా కామెంట్లు చేయడం రేవంత్ రెడ్డి పాలనకు చాలా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. సొంత పార్టీ వారికే కాంగ్రెస్ ప్రభుత్వంపై సంతృప్తి లేదు అనే కోణంలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయవచ్చు. దీనివల్ల ప్రజల్లో కూడా ఆ భావన బలపడవచ్చు.
మాదిగల భూమిని కబ్జా చేస్తే అడ్డుకోలేనిది కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని వీ హనుమంతరావు తాజాగా కామెంట్లు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన మరుసటిరోజే కీసరలో భూ కబ్జా వ్యవహారాన్ని పరిష్కరించాలని తాను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తెలియజేశానని కానీ ఎవరూ స్పందించలేదని ఆయన మండిపడ్డారు. ఎవరి భూమి వారిదే అని పాదయాత్రలో కాంగ్రెస్ నేతలు చెబుతూ వచ్చారని కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాట పూర్తిగా మర్చిపోయారని ఆ విమర్శించారు. తెలంగాణలో ఉన్నది అసలైన ఇందిరమ్మ ప్రభుత్వమే అయితే ఈ భూ కబ్జా సమస్యలను పది రోజుల్లో పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలా చేయకపోతే కబ్జా చేసిన స్థలంలోనే కూర్చొని బాధితులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. శనివారం గాంధీ భవన్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. "1981లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఉంది. ఆ ప్రభుత్వమే కీసరలో 10 వేల మంది పేద మాదిగలకు 94 ఎకరాల భూమి ఇచ్చింద"ని వెల్లడించారు.
 ఈ ఎకరాల భూమికి దగ్గరలో ఓఆర్‌ఆర్‌ రావడం వల్ల భూ కబ్జాదారుల కన్ను మాదిగల భూమిపై పడిందని, 2003 తర్వాత వారి స్థానంలో రాగి కృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరు వచ్చిందని అన్నారు. ఈ భూములను ఫోర్జరీ సంతకాలు చేయించి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఆరోపణలు చేశారు. వీరి కారణంగా భూ యజమానుల వారసులు న్యాయం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కబ్జా చేసిన భూముల్లో విల్లాలు కట్టి, ఒక్కో విల్లాను రూ.3 కోట్లకు అమ్ముతున్నారని చెప్పుకొచ్చారు. ఈ కబ్జా వ్యవహారంలో రూ.500 కోట్ల భారీ స్కాం జరుగుతోందని షాకింగ్ కామెంట్లు చేశారు. హైకోర్టులో కేసు నడుస్తున్న మరోవైపు ఈ భూముల్లో విల్లాల కన్స్ట్రక్షన్ కి  హెచ్‌ఎండీఏ అనుమతి ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. ఈ నిర్మాణ పనులు వెంటనే ఆపించేయాలని కూడా డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: