ఏపీ: కొత్త‌వాళ్ల‌కు చంద్రబాబు అందుకే ఛాన్స్‌ ఇచ్చాడా?

Suma Kallamadi
చంద్ర‌బాబు ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన తరువాత రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే 24 మందితో బాబు కేబినెట్ తాజాగా సిద్ధ‌మైంది. ఈ మంత్రివ‌ర్గ కూర్పు వెన‌కాల టీడీపీ, లోకేశ్ ఫ్యూచ‌ర్ వ్యూహం ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ 24 మందిలో 17 కొత్త‌వాళ్లే ఉండ‌ట‌మే దానికి కారణం. అవును, మంత్రి ప‌ద‌వుల కోసం సీనియ‌ర్లు ఆశ పడినప్పటికీ బాబు వారికి నిర్మొహ‌మాటంగా నో చెప్పారు. ఇక కేబినెట్‌లో పాత నాయ‌కులు ప్రస్తుతం అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయ‌ణ‌, కొల్లు ర‌వీంద్ర‌, ఎన్ఎండీ ఫ‌రూక్‌, ప‌య్యావుల కేశ‌వ్ లాంటి వాళ్లు మాత్ర‌మే ఉండడం కొసమెరుపు.
ఇక మిగిలిన వాళ్ల‌లో పార్టీ ప‌రంగా సినియారిటీ ఉన్నప్పటికీ మంత్రి ప‌దవులు వారికి కొత్త‌. భ‌విష్య‌త్‌లో పార్టీని ప‌రుగులు పెట్టించాలంటే యువ‌త మంత్రివ‌ర్గంలో ఉండాల‌ని బాబు యోచించినట్టుగా ఇక్కడ అర్ధం అవుతోంది. మ‌రోవైపు టీడీపీలో ఫ్యూచ‌ర్ లీడ‌ర్‌ ఎవరంటే నిస్సందేహంగా లోకేశ్ పేరే వినిపిస్తుంది మనకు. అందుకే లోకేశ్‌కు అనుగుణంగా మంత్రివ‌ర్గాన్ని బాబు డిసైడ్ చేశార‌ని గుసగుసలు వినబడుతున్నాయి. లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌తో తిరిగి రాష్ట్రంలో టీడీపీకి ఆద‌ర‌ణ ద‌క్క‌డంలో త‌న వంతు పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసినదే. ఈ యాత్ర‌ను స‌క్సెస్ చేసిన వాళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌డంలో లోకేశ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో బాబు త‌న‌కు న‌మ్మ‌క‌స్థుల‌నూ దూరం పెట్టేందుకు వెనకాడలేదని సమాచారం. ప‌రిటాల సునీత‌, ప్ర‌త్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, గోరంట్ల బుచ్చ‌య్య లాంటి వాళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు లేవు. ఇక ఇప్పుడు వారికి అసంతృప్తి వెళ్ల‌గ‌క్కే అవ‌కాశం కూడా లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నిక‌ల్లో పార్టీ గొప్ప విజ‌యం సాధించింది. అందుకే బాబు బ‌య‌టి విష‌యాల‌ను ప‌ట్టించుకోకుండా తాను అనుకున్న‌దే చేస్తున్నార‌నే అభిప్రాయాలు బయట వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: