కొడాలి - వంశీల ఫ్యూచ‌రేంటి.. పార్టీ మారేదెవ‌రు...!

RAMAKRISHNA S.S.
( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )
వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు.. రెచ్చిపోయిన విష‌యం తెలిసిందే. వారు ఇద్ద‌రికీ కూడా.. టీడీపీతో అవినాభ సంబంధం ఉంది. టీడీపీలో నే పుట్టి.. టీడీపీ లోనే పెరిగిన వారు.. త‌ర్వాత‌.. వైసీపీ వైపు మ‌ళ్లారు. ఇది త‌ప్పుకాదు. ఎవ‌రికి ఎక్క‌డ ప‌రిస్థితి అనుకూలం గా ఉంటే అటు అడుగులు వేయ‌డం.. దీనిని ప్ర‌జ‌లు కూడా ఆహ్వానించ‌డం కొత్త కాదు. గ‌తంలో కాంగ్రెస్ నాయ‌కుడిగా ఉన్న చంద్ర‌బాబును ప్ర‌జ‌లు టీడీపీ నేత‌గా ఆహ్వానించారు.

గ‌తంలో కాంగ్రెస్ నాయ‌కుడిగా ఉన్న జ‌గ‌న్‌ను సొంత పార్టీ పెట్టుకుంటే.. ప్ర‌జ‌లు ఆహ్వానించ‌లేదా?  అం టే.. ఆహ్వానించారు. ఇలా పార్టీలు మార‌డం త‌ప్పుకాదు.కానీ, నోటిని.. ప్ర‌వ‌ర్త‌న‌ను అదుపులో పెట్టుకోక‌పోతే నే ఇబ్బందులు ప‌డ‌తారు. ఈ ప‌రిణామ‌మే ఇప్పుడు గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానీని ఇబ్బందుల‌కు గురి చేసింది. వీరి గెలుపుపై ధీమా ఉన్న‌ప్ప‌టికీ.. తాజా ఎన్నికల్లో ఊహించ‌ని ప‌రాభ‌వం చవి చూశారు. కేవ‌లం ఓ రెండు వేల ఓట్లతో ఓడిపోతే.. వేరేగా ఉండేది.

కానీ, 50 వేల దాదాపు ఓట్ల తేడాతో ఇద్ద‌రూ కూడా ప‌రాజ‌యం పాల‌య్యారు. దీంతో వీరి ఫ్యూచ‌ర్ ఏంటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇవే త‌న‌కు చివరి ఎన్నిక‌ల‌ని కొడాలి నాని చెప్పారు. తాను ఇప్పుడు 50+లో ఉన్నాన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తాను పోటీ చేయ‌బోన‌ని కూడా అన్నారు.కానీ, ఇప్పుడు ఓడిపోయారు. మ‌రి ఆయ‌న రాజ‌కీయాల‌కు దూర‌మ‌వుతారా?  కొన‌సాగుతారా?  ఎలా ప్ర‌జ‌ల్లోకివెళ్తార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతానికి మౌనంగా ఉన్నారు.

ఇక, వంశీ విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబు కుటుంబాన్ని ఆయ‌న కెలికార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. పైగా నారా లోకేష్ క‌నుస‌న్న‌ల్లోనూ ఈయ‌న ఉన్నారు. దీంతో కొన్ని రోజుల‌కైనా.. వంశీపై కేసులు అరెస్టులు జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు. అప్పుడు వైసీపీ ఈయ‌న‌ను ఆదుకుంటుందా?  అనేది ప్ర‌శ్న‌, పోనీ.. వేరే పార్టీల‌లోకి చేరాల‌న్నా.. బీజేపీ రానివ్వ‌దు.. జ‌న‌సేన‌లోకి అవ‌కాశం లేదు. దీంతో ఇబ్బందులు ప‌డ‌తారా?  లేక రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటారా?  అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: