బరువెక్కిన హృదయంతో మళ్ళీ కష్టపడతానంటున్న జగన్?

Purushottham Vinay
ఎన్నికలు ఫలితాలు వచ్చేసాయి. ఊహించని దానికంటే ఘోరంగా వైసీపీ ఓడిపోయి.. టీడీపీ కూటమి గెలిచింది. 2019 లో చాలా కష్టపడి భారీ మెజారిటీతో సీఎం అయిన జగన్ ఓటమి బాధని తట్టుకోలేక బరువెక్కిన హృదయంతో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. తన బాధని ఈ విధంగా జగన్ తెలిపారు. "నా రజకులకు, నా నాయి బ్రాహ్మణులకు నేను అండగా ఉంటూ వచ్చాను. వారి ఓట్లు ఏమయ్యాయో తెలియదు." అని అన్నారు. 


ఇంకా మాట్లాడుతూ "ఇన్ని లక్షల మందికి ఎంతో మంచి చేశాను.ఇన్ని కోట్ల మందికి ఎంతో మంచి జరిగింది. ఎప్పుడు జరగని విధంగా నేను నా ప్రజలకు మంచి పని చేశాను. మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని ఒక కురాన్ అని ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి భావిస్తూ వచ్చాను.ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను అక్క చెల్లెమ్మలకు ఇచ్చి  పేదరికం పోవాలంటే పిల్లల చదువులకు నాణ్యమైన విద్య కావాలి అని ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్న వారు అందరికి ధీటుగా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తీసుకురావటంతో పాటు నాడు నేడు ద్వారా పాఠశాల విద్యను మార్చాను.చరిత్రను మార్చాలని ఎప్పుడూ చూడని విధంగా గ్రామస్థాయిలోనే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి ప్రతి ఇంటికి సేవలందించే కార్యక్రమం చేశాను. ఎటువంటి వివక్ష లేకుండా కరప్షన్ లేకుండా చేశాను.సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి నేను చూపించాను. ఇలా ఇంత మంచి చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత కూడా ప్రజల ఆ అభిమానం ఆప్యాయత ఏమయ్యాయో తెలియటం లేదు.అన్ని వర్గాలను ఎంతగానో అభివృద్ధి చేయాలని చూశాను పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడు కూడా పేదవాడికి అండగా ఉండాలని అనుకున్నాను.మహిళా సాధికారత సామాజిక న్యాయం అంటే ఏంటో అమలు చేసి చూపించాను" అని అన్నారు. 


"ఏది ఏమైనా ప్రజల తీర్పును తీసుకుంటాం.ఓడిపోయిన కూడా నాకు ప్రతి కష్టంలో తోడుగా అండగా నిలబడిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తకు ప్రతి వాలంటీర్ కు ప్రతి ఇంట్లో నుంచి వచ్చి నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని జగన్ అన్నారు.


 "కచ్చితంగా మళ్ళీ ఇక నుంచి లేస్తాం మళ్ళీ ఇక్కడ నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్లీ లేస్తాం.ప్రతిపక్షంలో ఉండటం నాకు కొత్త కాదు. పోరాటం చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే ఎక్కువగా ఉన్నాను. ఎన్నో పోరాటాలు చేశాను.రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని కష్టాలు కూడా నేను అనుభవించాను.ఇప్పుడు అంతకన్నా ఎక్కువ కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా ఎదుర్కొంటాను" అని జగన్ అన్నారు.గవర్నమెంట్ లోకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు, బీజేపీ పార్టీ నేతలకు జగన్ అభినందనలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: