ఏపీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా కష్టమేనా.. ఆ తప్పులే ముంచేశాయా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫలితాల సరళి చూసి షాకవ్వడం వైసీపీ నేతల వంతవుతోంది. జగన్ పాలనకు ఏపీ ఓటర్లు చరమ గీతం పాడేశారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ఏ దశలో కూడా వైసీపీ పుంజుకోలేదు. ఐదేళ్ల క్రితం టీడీపీ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొందో ఈ ఎన్నికల్లో వైసీపీ సైతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు గెలవాలి.
 
అయితే ఇప్పుడున్న పరిస్థితులలో కనీసం అన్ని స్థానాల్లో కూడా వైసీపీ గెలవడం కష్టమని తేలిపోయింది. జగన్ నియంతృత్వ పోకడలు, అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం, రాజధాని విషయంలో పొరపాట్లు, రోడ్ల విషయంలో నిర్లక్ష్య ధోరణి, పథకాల అమలు మినహా ప్రజల మనస్సులను ఎరుగకపోవడం వైసీపీ నిలువునా ముంచేశాయి. రాష్ట్రంలో వైసీపీ ఏ స్థాయిలో మునిగిపోయిందంటే మళ్లీ ఎంత కష్టపడినా ఇక్కడ వైసీపీ పుంజుకోవడం కష్టమని తేలిపోయింది.
 
ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ ఒక్క ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోలేకపోయారు. అప్పులు చేసి జగన్ పథకాలను అమలు చేశారనే భావన ప్రజల్లో సైతం అలానే ఉండిపోయింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా వైసీపీ రిజల్ట్ పై ప్రభావం చూపింది. అభ్యర్థులు మరీ బలంగా ఉన్న ప్రాంతాలలో మాత్రమే వైసీపీ సత్తా చాటిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
కూటమి కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిన ప్రాంతాలలో సైతం చంద్రబాబును చూసి ఆయనకు ఓటు వేశారని తెలుస్తోంది. వైసీపీ 15 స్థానాలకే పరిమితం కావచ్చని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ ఫలితాల గురించి జగన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. గెలుపు కోసం వైసీపీ భారీ స్థాయిలోనే ఖర్చు చేసినా ఫలితాలు మాత్రం మరో విధంగా ఉండటం కొసమెరుపు. ఫలితాల గురించి జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: