ఈ ఆరుగురిలో హీరోలెవ్వ‌రు... జీరో లెవ్వ‌రు..?

RAMAKRISHNA S.S.
- పురందేశ్వ‌రి, కిర‌ణ్‌కుమార్‌, సీఎం ర‌మేష్ గెలిస్తేనే ఫ్యూచ‌ర్‌
- కామినేని, విష్ణుకుమార్‌, సుజ‌నా ఓడితే ఇండికే..?
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బిజెపి.. తెలుగుదేశం - జనసేన పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని పది అసెంబ్లీ సీట్లతో పాటు ఆరు పార్లమెంటు స్థానాలకు పోటీ చేసింది. బిజెపి నుంచి పోటీ చేసిన వారిలో అయిదారు గురు నేతలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మార‌నున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే వారు కచ్చితంగా హీరోలు అవుతారు.. ఓడిపోతే మాత్రం జీరోలుగా మిగిలిపోతారు. రాజకీయంగా కొన్నేళ్లపాటు చక్రం తిప్పి ఒక వెలుగు వెలిగిన నేతలకు ఈసారి బిజెపి నుంచి పోటీ అనేది పెద్ద అగ్నిపరీక్షగా మిగిలిపోనుంది. బిజెపి నుంచి పోటీ చేస్తున్న వారిలో రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందరేశ్వరి - అనకాపల్లి నుంచి మాజీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ - రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

ఈ ముగ్గురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేతలు. వీరిలో గెలిచినవారు పార్లమెంట్లో అడుగుపెట్టి చక్రం తిప్పుతారు.. కేంద్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అన్న అంచనాలు ఉన్నాయి. కాస్త సీట్లు తగ్గినా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రి కావటం ఖాయం. అలాంటి టైంలో బిజెపి నుంచి లోక్‌భలో అడుగు పెడితే వారి హవా ఐదేళ్లపాటు తిరుగులేకుండా కొనసాగుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివర ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత రాజకీయంగా ఆయన ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఈసారి ఎంపీగా గెలిస్తే ఆయన కచ్చితంగా కేంద్ర మంత్రి అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

ఇక రెండుసార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వ‌రి 10 ఏళ్ళు కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నా కూడా ఆమె రెండుసార్లు లోక్ సభకు పోటీ చేసి ఓడిపోవడం మైనస్ అయింది. ఈసారి గెలిస్తే ఆమెకి కూడా కేంద్ర మంత్రి పదవి వస్తుంది. లేక‌పోతే ఆమె రాజ‌కీయం ఇక ముగిసిన‌ట్టే. ఇక తెలుగుదేశం నుంచి రెండుసార్లు వరుసగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సీఎం రమేష్ కు కూడా ఈ ఎన్నికలు కీలకంగా ఉన్నాయి. ఈ ముగ్గురిలో గెలిచిన నేతలు ఐదేళ్లపాటు కేంద్రంలో కీరోలు పోషిస్తారు.. ఓడిన నేతలు రాజకీయంగా పట్టుకోల్పోతారు.

ఇక అసెంబ్లీకి పోటీ చేస్తోన్న మ‌రో కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, వైజాగ్ నార్త్ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుల‌కు కూడా ఈ ఎన్నిక‌లు చావోరేవో. కామినేని ఓడిపోతే ఇక పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ క‌ష్ట‌మే. త‌న స్థాయికి త‌గ్గి క‌ష్ట‌మైన సీట్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న సుజ‌నా చౌద‌రి గెలిస్తే.. అసెంబ్లీలో కీలకం కావ‌డంతో పాటు ఎన్డీయే ప్ర‌భుత్వం ఏపీలో వ‌స్తే మంత్రి అయినా అవుతారు. ఇక విష్ణుకుమార్ రాజు ఈ సారి గెలిస్తే ఏపీ ప్ర‌భుత్వంలో మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది సీనియార్టీ కోటాలో.. లేక‌పోతే ఆయ‌న వైపు కూడా ఎవ్వ‌రూ చూడ‌రు. అందుకే ఈ ఆరుగురు బీజేపీ నేత‌ల్లో ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఎవ‌రు హీరోలు అవుతారో.. ఎవ‌రో జీరోల‌వుతారో ?  చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: