బీఆర్ఎస్ : ఆపదలో కేసీఆర్.. రంగంలోకి దిగిన జేడీ లక్ష్మీనారాయణ!

Veldandi Saikiran
ఆపదలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోసం రంగంలోకి దిగారు జెడి లక్ష్మీనారాయణ. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ అయిన జెడి లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాజకీయాలలో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసిన వెంటనే జనసేన పార్టీలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ... పవన్ కళ్యాణ్ వ్యక్తిగత నిర్ణయాలు, తదితర అంశాల నేపథ్యంలో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. అప్పటినుంచి రాజకీయాల్లోనే... కొనసాగుతున్న జేడీ లక్ష్మీనారాయణ... తాజాగా కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ BRS కు మద్దతు తెలిపారు ఈ మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. నల్గొండ, వరంగల్ అలాగే ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఇటీవల రిలీజ్ అయింది. ఈనెల చివర్లో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు.
దీంతో గులాబీ పార్టీ, కాంగ్రెస్ అలాగే బిజెపి పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి దూసుకు వెళ్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి జేడీ లక్ష్మీనారాయణ తన మద్దతు తెలిపారు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపయోగి ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు జెడి లక్ష్మీనారాయణ. ఏనుగుల రాకేష్ రెడ్డి గెలిస్తే యువతకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్సీ అయితేనే.. అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.
దీంతో ఆపదలో ఉన్న కేసీఆర్ పార్టీని ఆదుకునేందుకు మరో మాజీ ప్రభుత్వాధికారి రంగంలోకి దిగారని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు జెడి లక్ష్మీనారాయణ కూడా గులాబీ పార్టీ కోసం రంగంలోకి దిగారు. కాగా ఈ ఉప ఎన్నికల్లో ముఖ్యంగా తీన్మార్ మల్లన్న వర్సెస్ ఏనుగుల రాకేష్ రెడ్డి మధ్య పోటాపోటీ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: