తెలంగాణలో ఆ పార్టీ సునామీ సృష్టించబోతోందా?

Chakravarthi Kalyan
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగిసింది. 62 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఇది అసెంబ్లీతో పోల్చితే తగ్గినా.. గత లోక్ సభ ఎన్నికల కంటే ఎక్కువ కావడం గమనార్హం. మొత్తం 17 స్థానాల్లో 10 స్థానాలకు పైగా 70శాతం ఓటింగ్ శాతం నమోదు అయింది. అయితే ఆది నుంచి రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉంటుందని అంతా భావించినా.. చివరకు పోటీ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే సాగిందని అంచనా వేస్తున్నారు.

అందరూ ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తర తెలంగాణలో ఒకలా.. దక్షిణ తెలంగాణలో ఒకలా పోలింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదున్నర నెలల క్రితం జరగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం, ఈ ఎన్నికల్లో పూర్తి రివర్స్ అవుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని లోక్ సభ స్థానాల్లో భారీగానే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం.

మరీ ఇది ఎవరికీ మేలు చేస్తుంది అనేది  పక్కన పెడితే.. ఈ ఎన్నికలను దేశ ఎన్నికలుగానే ఓటర్లు భావించారు. మెజార్టీ సీట్లలో పోటీ కాంగ్రెస్, బీజేపీ ల మధ్యే నడిచింది. చాలా చోట్లపార్టీ కేడర్, ఓటర్లు తమ పార్టీ అభ్యర్థి ఎలాగూ గెలవడన్న ఉద్దేశంతో బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఎందుకంటే యాంటీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం ఒక దగ్గరకి చేరిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తద్వారా 2019తో పోలిస్తే కమలనాథులకు గణనీయంగా ఓట్లు, సీట్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39.40, బీఆర్ఎస్ కు 37.35, బీజేపీకి 13.9 శాతం  ఓట్లు వచ్చాయి.  కానీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటింగ్ గణనీయంగా తగ్గి బీజేపీ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంది. అది ఎంత మేర అనేది ఎన్నికల తర్వాత తేలనుంది. ఒకవేళ 30శాతానికి కనుక బీజేపీ చేరుకుంటే ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని మనం భావించవచ్చు. మొత్తం మీద విభిన్న ఫలితాలను తెలంగాణ ఎన్నికల్లో మనం చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: