తదుపరి ప్రధాని అమిత్‌షా.. యోగీపై వేటు..?

Chakravarthi Kalyan
దేశంలో బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తే ప్రధాని అయ్యేది నరేంద్ర మోదీయే. తానే ప్రధాని అని ఆయన ప్రతి ఎన్నికల సభలోను చెబుతున్నారు. బీజేపీలో చూస్తే ఈ రోజు వరకు కూడా ఆయనకు ఈ విషయంలో పోటీనే లేదు. ఫుల్ మెజార్టీ వస్తే మోదీని మించి ఎవరూ కూడా మరో మాట కూడా తీసుకు రారు అని అంటారు.


అయితే బీజేపీ ఇప్పుడు సొంతంగా 370 సీట్లు సాధించాలని అలాగే ఎన్డీయే పక్షాలతో కలుపుకొని 400 స్థానాలు అనే అతిపెద్ద లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతోంది. ఈ కీలక సమయంలో బెయిల్ పై బయటకు వచ్చిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర చర్చకు తెర లేపారు. మోదీ వారసత్వం మీద ఆయన పెట్టిన డిబేట్ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మోదీకి తొందర్లో డెబ్భై అయిదేళ్లు నిండుతాయి. కాబట్టి ఆయన వారసుడు ఎవరూ అంటూ కేజ్రీ వాల్ ఒక చర్చను ప్రజల ముందుకు తీసుకువచ్చారు.


ఏడున్నర పదుల వయసు దాటిన వారు క్రియాశీల రాజకీయాల్లో ఉండరాదని బీజేపీ ఒక రూల్ ను పాస్ చేసింది. తద్వారా అగ్రనేతలు మురళీ మనోహర్ జోషి, ఆడ్వాణీ, ఉమాభారతి వంటి నేతల్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు అదే రూల్ మోదీకి వర్తిస్తుందని…ఆ లెక్కన మోదీ తర్వాత ప్రధాని అయ్యేది అమిత్ షాయేనని పేర్కొన్నారు. అంతే కాకుండా మూడో సారి మోదీ ప్రధాని అయ్యాక బీజేపీలో వేటు పడబోయేది యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ పైనేనని బాంబ్ పేల్చారు.


అయితే ఈ వ్యాఖ్య వెనుక రాజకీయం వ్యూహం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీని చూసి కాకుండా నరేంద్ర మోదీని చూసి ఓటేస్తున్నారు అనేది వాస్తవం. బీజేపీ కూడా మోదీ గ్యారంటీ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని కారు అనే చర్చను తెరపైకి తెస్తే తటస్థులు ఆలోచనలో పడే అవకాశం ఉంది. మరోవైపు యోగీని కూడా పక్కన పెడతారు అని చెప్పి కేజ్రీవాల్ బీజేపీని ఇరుకున పెట్టారు. మరి ఇది ఓటర్లపై ఏ మేర ప్రభావం చూపుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: