ఓటేస్తారా... విశ్రాంతి తీసుకుంటారా... ఇది చ‌దివితే.. మీరే నిర్ణ‌యించుకుంటారు...!

RAMAKRISHNA S.S.
- ఓటేసేందుకు ఆస‌క్తి చూప‌ని న‌గ‌ర జ‌నం
- సోష‌ల్ మీడియా పోస్టులు పెడ‌తారే గాని.. ఓట్లేయ‌ని యువ‌త‌
( అమరావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ప్రపంచంలోని ప్ర‌జాస్వామ్య దేశాల్లో ఎక్క‌డా లేని విధంగా.. ఒక్క మ‌న దేశంలోనే సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగే రోజును సెల‌వు దినంగా ప్ర‌క‌టించారు. ఇత‌ర దేశాల్లో ఈ వెసులుబాటు లేదు. అక్క‌డ అధునాత సౌక‌ర్యాలు వ‌చ్చాయి. ఇంటి నుంచి ఆన్‌లైన్ లో ఓటేయొచ్చు. ఇక్క‌డ అది లేదు. బూత్‌కు వ‌చ్చి.. వేయాల్సిందే. దీంతో ప్ర‌భుత్వాలు.. ప్రైవేటు సంస్థ‌లు కూడా.. పోలింగ్ జ‌రిగే రోజును సెల‌వు దినంగా ప్ర‌క‌టించాయి.

దీంతో చాలా మంది యువ‌త‌.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవులు.. కొన్ని ర‌కాల‌ ఉద్యోగులు.. కూడా.. దీనిని సెల‌వు దినంగానే ప‌రిగ‌ణిస్తూ.. ఇంటికే ప‌రిమితం అవుతున్నాయి. ఓటు వేయ‌డం నిర్బంధం కాబ‌ట్టి.. ఎవ‌రూ వారిని ప్ర‌శ్నించరు. కానీ, ఇది మంచి ప‌ద్ద‌తి కాదు. ఎందుకంటే.. మ‌నం కోరుకున్న‌ట్టుగా ఏదీ జ‌ర‌గ‌డం లేద‌ని.. ప్ర‌భుత్వంలో అవినీతి పేరుకుపోయింద‌ని.. రోడ్లు స‌రిగా లేవ‌ని.. నీళ్లు స‌రిగా ఇవ్వ‌డం లేద‌ని.. మ‌త విద్వేషాలు పెంచుతున్నార‌ని.. వీరు ఏం పాల‌కుల‌ని.. మ‌నం త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాం.. క‌దా.. అలాంటి వారిని మార్చేందుకు.. ఉన్న అద్భుత‌మైన అవ‌కాశం ఓటే.

నిజానికి సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు ప‌ట్టే స‌మ‌యంలో స‌గం మాత్ర‌మే ఓటు వేసేందుకు ప‌డుతుందంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. అంతేకాదు.. ఐదేళ్ల త‌ల‌రాత‌ను మార్చుకునేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది. ఇక్క‌డ ఎవ‌రూ ఏమీ బ‌ల‌వంతం చేయ‌క‌పోవ‌డంతో చాలా మంది సెల‌వులు తీసుకుని ఇంట్లోనే ఉంటున్నార‌నేది ఇటీవ‌ల ఏడీ ఆర్ చేసిన స‌ర్వేలో తేలింది. కానీ, ప్ర‌జాస్వామ్య దేశాల‌కు ఓటు ప్రాణ వాయువు. మీకు నచ్చిన వారికే ఓటేయొచ్చు. ఎవ్వ‌రూ న‌చ్చ‌క‌పోతే.. నోటాకు ఓటేసే స‌దుపాయం కూడా ఉంది.

మొత్తంగా చూసుకుంటే.. కార్మికులు. కూలివారు.. వ్య‌వ‌సాయ ప‌నులు చేసుకునేవారు, వృద్ధులు, దివ్యాంగులు సైతం త‌ర‌లి వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు త‌ప్ప‌.. న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల్లో ఉన్న‌వారు ఓటు వేయ‌డం లేద‌న్న అప‌ప్ర‌ద ఎప్ప‌టి నుంచో ఉంది. మ‌రి ఇప్పుడైనా.. ఓ పావుగంట కేటాయిస్తే.. ఓ ప‌దినిమిషాలు క్యూలైన్‌లో వేచి ఉంటే.. (సినిమా టికెట్ ల కోసం.. వేచి ఉండే స‌మ‌యం కన్నా త‌క్కువ‌) ఓటు హ‌క్కు వినియోగించుకునే వెసులు బాటు.. నాయ‌కుల‌ను ఎంచుకునే వెసులు మ‌న చేతుల్లోనే ఉంది. మ‌రి ఏం చేస్తారో.. నిర్ణ‌యించుకోండి. చేతులు కాలిపోయాక (ఓటు వేయ‌కుండా..)  ఆకులు ప‌ట్టుకునే (ప్ర‌భుత్వం బాలేదు. నాయ‌కుడు బాలేదు అనే టాక్‌) ప‌రిస్థితి వ‌ద్దంటే.. ఓటు వేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: