ఏలూరు జిల్లాలోనే ప‌క్కా టీడీపీ గ‌న్ షాట్ సీట్ ' సొంగా రోష‌న్ ' ..!

RAMAKRISHNA S.S.
- గ్రూపులున్నా స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళుతోన్న రోష‌న్‌
- టీడీపీ గెలుపులో జంగారెడ్డిగూడెం టౌన్‌, మండ‌లం మెజార్టీయే కీల‌కం
- ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, వైసీపీ లుక‌లుక‌లు కూడా ప్ల‌స్ కానున్నాయా ?
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ రాజకీయం చాలా హాట్ హాట్ గా కొనసాగుతోంది. ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.. ? అనేది సహజంగానే ఆసక్తిగా మారింది. తెలుగుదేశం నుంచి ఎన్నారై సొంగా రోష‌న్‌ కుమార్, వైసీపీ నుంచి మాజీ ప్రభుత్వ ఉద్యోగి కంభం విజయరాజు పోటీ చేస్తున్నారు. విజయరాజు స్వగ్రామం కామవరపుకోట కాగా.. రోష‌న్‌ స్వగ్రామం లింగపాలెం మండలంలోని ధర్మాజీగూడెం. వీరిద్దరికీ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయటం ఇదే తొలిసారి. గత చరిత్ర చూస్తే చింతలపూడి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ పుట్టాక ఆరుసార్లు గెలిచిన తెలుగుదేశం మూడుసార్లు ఓడింది. అందులో రెండుసార్లు వెయ్యి ఓట్లకు అటూ ఇటూ స్వల్ప తేడాతో ఓడింది.

గత ఎన్నికలలోనే వైసీపీకి ఏకంగా 36 వేల ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. అప్పుడు చాలా సమీకరణలు వైసీపీకి కలిసి వచ్చాయి. ఏలూరు ఎంపీగా పోటీ చేసిన కోటగిరి శ్రీధర్ కు.. చింతలపూడి సొంత నియోజకవర్గం కావటం.. ప్రభుత్వ వ్యతిరేకత.. వైసీపీలో గ్రూపులు అన్నీ కలిసికట్టుగా పనిచేశాయి. ఈసారి ఆ పరిస్థితి లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాపై పార్టీలో చాలా వర్గాలు వ్యతిరేకంగా ఉండడంతో జగన్ ఆయనను తప్పించి.. విజయరాజుకు సీటు ఇచ్చారు. ఇంకా చెప్పాలి అంటే ఉమ్మడి జిల్లాలో వైసీపీ నుంచి సీటు దక్కించుకోలేని ఏకైక ఎమ్మెల్యే ఎలీజా. ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తున్నారు. దీనికి తోడు ఎంపీ శ్రీధర్ పరిస్థితులు ముందుగానే అర్థం చేసుకొని.. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

విచిత్రమింటంటే విజయరాజుకు సీటు వచ్చేవరకు ఆయన కోసం గట్టిగా ఫైట్ చేసిన కీలక నాయకులే.. ఇప్పుడు ఆయనతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందే ఈ పరిస్థితి ఉండటం వైసిపికి మైనస్ గా మారింది. ఇక నియోజకవర్గంలోనే కీలకమైన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ తో పాటు.. జంగారెడ్డిగూడెం మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలవనున్నాయి. జనసేనతో పొత్తు కూడా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సొంగా రోష‌న్‌కు బాగా కలిసి రానుంది. నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపు ఓటర్లు.. తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు, ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీలో లుకలుక‌లు ఇవన్నీ రోషన్ గెలుపులో కీలకం కానున్నాయి.

వైసీపీ విషయానికి వస్తే విజయరాజుకు ముందుగానే సీటు ఖరారు అయినా.. ఆయనకు టిక్కెట్ వచ్చేందుకు ఎంతో కష్టపడిన ఎంపీ శ్రీధర్ వర్గంలో కీలక నాయకులకు, ఆయనకు ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది. మనస్ఫూర్తిగా కలిసి పని చేస్తున్న పరిస్థితి కనపడటం లేదు. ఆయనకు సీటు ఇచ్చినప్పుడు ఉన్న ఊపు ఇప్పుడు కనబడటం లేదన్న చర్చే ఎక్కువగా నడుస్తోంది. ఇక టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్‌ కుమార్ నియోజకవర్గంలో గ్రూపులు ఉన్నా ఎవరి మనసులు నొప్పించకుండా.. అందరిని ఒప్పించుకుంటూ సౌమ్యంగా ముందుకు వెళుతూ అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్న తీరు బాగుంది. ఎన్ని గ్రూపులు ఉన్న అంతిమంగా పార్టీ కోసం పనిచేసే విషయంలో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా రావటం కూడా రోష‌న్‌కు ప్లస్ అవుతుంది.

టికెట్ ప్రకటించినప్పటి నుంచి రోషన్ నియోజకవర్గంలో అందరినీ కలుస్తూ దూసుకుపోతూ ముందుకు వెళుతున్నారు. ఫైనల్ గా చెప్పాలంటే ఎన్నికలకు 20 రోజులు ముందు చింతలపూడిలో వాతావరణం ఎలా ? ఉందని ప్రశ్నిస్తే.. ఖచ్చితంగా టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఏలూరు జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలు అన్నిటికంటే టీడీపీ ఫస్ట్ గెలిచే సీటు ఏది ? అన్న ప్రశ్నకు చింతలపూడి ఆన్సర్ గా వినిపిస్తోంది. కైకలూరు, నూజివీడు, దెందులూరు, ఉంగుటూరు ఇలా ఏ నియోజకవర్గంలో చూసిన టఫ్ కాంపిటేషన్ ఉంది. బెట్టింగ్ రాయుళ్ళు కూడా చింతలపూడిలో టీడీపీ మీద దూకుడుగా ముందుకు వస్తున్నారు. మరి ఎన్నికల టైంకు ఈ పోరు ఎలా మారుతుందో ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: