జనసేన నుంచి కూటమికి కొత్త సమస్య?

Purushottham Vinay
రాబోయే ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కూటమికి కొత్త సమస్య అనేది ఏర్పడింది. జనసేన పార్టీ బరిలో ఉన్నచోటే ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు దక్కనుంది. మిగిలిన చోట్ల మాత్రం ఇండిపెండెంట్లకు దక్కనుంది. బీజేపీ - టీడీపీ - జనసేన కూటమిగా ఏర్పడగా... ఈ సమయంలో జనసేన తరుపున కూటమికి కొత్త సమస్య  వచ్చింది. ఇది ఇప్పుడు జనసేన పోటీ చేసే స్థానాల్లో తప్ప మిగిలిన చోట్ల సమస్యగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన కలిగిస్తుంది. నిజానికి జనసేనకు గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఇవ్వడాన్ని హైకోర్టు అనుమతించింది. ఆ తర్వాతే మరో సమస్య  వచ్చింది.జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయిస్తారు. మిగిలిన 144 అసెంబ్లీ, 23 లోక్ సభ స్థానాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా కోరుకుంటే వారికి ఈ గుర్తు ఇచ్చే అవకాశం ఉంది.ఇందుకు కారణం ఇండిపెండెంట్లు కోరుకోవడానికి వీలుగా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ఫ్రీ సింబల్స్‌ లో గాజు గ్లాసు గుర్తు కూడా ఉండటమే.


అందువల్ల ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు లేని అన్ని స్థానాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులు కోరితే ఈ గుర్తు కేటాయిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో... జనసేన అభ్యర్థులు లేని 144 + 23 చోట్ల గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు కేటాయిస్తే తాము ఖచ్చితంగా నష్టపోతామని ఈ రెండు పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ గుర్తు చూసిన కొందరు పొరపాటున స్వతంత్ర అభ్యర్థులకు ఓట్లు వేస్తే తమకు రావలసిన ఓట్లు తగ్గిపోతాయని అంటున్నారు.ఈ క్రమంలో... కూటమికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ.. జనసేన పోటీ లేని స్థానాల్లో తమకు కావలసిన వారిని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయించి, వారికి గాజు గ్లాసు గుర్తు దక్కించుకుంటే నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. పైగా ఈ సారి భారీ మెజారిటీలు కూడా కష్టం అని.. గరిష్టంగా 2 - 5 వేల లోపు మెజారిటీలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్న సమయంలో... ఈ గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్లు కూటమికి కలిగించే డ్యామేజ్ భారీగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: