కూట‌మి కంచుకోట‌లో వైసీపీ లేడి ఎంపీ అవుతుందా..?

RAMAKRISHNA S.S.

- జ‌న‌సేన + బీజేపీ + టీడీపీ క‌ల‌యిక‌తో మెజార్టీ సీట్ల‌లో లీడ్ ?
- న‌ర‌సాపురంలో జ‌గ‌న్ బీసీ లేడీ ప్ర‌యోగం
- వైసీపీకి ఒక్క సీటులో ఎడ్జ్ లేక‌పోయినా ఉమాబాల‌కు క్రాస్ ఓటింగ్ ?

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభావం గట్టిగా ఉన్న జిల్లాలలో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం విస్తరించి ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మామూలుగా చూస్తే కూటమి ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో.. వైసీపీ కచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేందుకు ఒక్క సీటు కూడా కనపడటం లేదు. అయినా కూడా ఎంపీ విషయానికి వస్తే కూటమి అభ్యర్థి గెలుస్తాడా అంటే చాలామంది సందేహిస్తున్నారు. వైసీపీ నుంచి బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది.. గూడూరి ఉమాబాల పేరు జగన్ ఎప్పుడో ఖరారు చేశారు.

కేవలం సామాజిక సమీకరణల నేపథ్యంలో ఉమాబాలకు టిక్కెట్ దక్కింది. ఆ మాటకు వస్తే శెట్టిబలిజ సామాజిక వర్గానికి తొలిసారిగా జగన్ రెండు ఎంపీ సీట్లు కేటాయించారు. రాజమండ్రి, నరసాపురం రెండు సీట్లు.. ఈ సామాజిక వర్గానికి దక్కాయి. కూటమి నుంచి బీజేపి తరఫున భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పేరు ఖరారు అయింది. ఇక్కడ పొత్తులో భాగంగా సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారు అని అందరూ అనుకున్నా.. చివరకు బీజేపీ రఘురామ‌కు సీటు ఇవ్వలేదు. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూస్తే పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు, ఆచంటలో మాజీ మంత్రి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పితాని సత్యనారాయణ, నరసాపురంలో జనసేన నుంచి పోటీ చేస్తున్న బొమ్మిడి నాయకర్, తణుకులో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఆరిమిల్లి రాధాకృష్ణ ముందంజలో ఉన్నారు.

తాడేపల్లిగూడెంలోనూ వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణపై.. జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ పైచేయి సాధిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కేవలం భీమవరంలో మాత్రమే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గట్టి పోటీ ఇస్తున్నా.. అది కూడా వైసీపీ కచ్చితంగా గెలుస్తుంది అని చెప్పలేని పరిస్థితి. ఉండిలో టీడీపీలో నెలకొన్న కుంపట్లు చల్లారడంతో అక్కడ కూడా టీడీపీ నుంచి పోటీ చేస్తున్న రఘురామరాజు విజయం సాధించేలా వాతావరణం మారుతుంది. పార్లమెంటు పరిధిలో వైసీపీ కచ్చితంగా ఒక్క సీటు గెలుస్తుందని గ్యారెంటీ లేకపోయినా పార్లమెంట్‌కు వచ్చేసరికి ఉమాపాలకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న నమ్మకాలు వైసీపీలో వ్యక్తం అవుతున్నాయి.

ఇక్కడ కూటమిలో భాగంగా బీజేపి సింబల్ ఉండడంతో కొన్ని సామాజిక వర్గాలు.. బీసీలు దీనికి తోడు వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు.. వైసీపీ అభ్యర్థివైపు మళ్లుతోందన్న ప్రచారం కూడా అంతర్గతంగా నడుస్తోంది. వాస్తవానికి 2014లో ఈ పార్లమెంటు నుంచి బీజేపి తరఫున గెలిచిన గోకరాజు గంగరాజుకు కేవలం 74 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు అంతా అనుకూలత పార్లమెంటు అభ్యర్థి విషయంలో కనపడటం లేదు. మరి వైసీపీ పెట్టుకున్నట్టు భారీ క్రాస్ ఓటింగ్ ఎంతవరకు జరుగుతుంది ఏంటి ? అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: