బెజవాడ పశ్చిమం: కనకదుర్గమ్మ దయ సుజ‌నాకా... ఆసిఫ్‌కా..?

RAMAKRISHNA S.S.
- టీడీపీ, బీజేపీకి ప‌ట్టులేని సీట్లో క‌మ్మ నేత‌గా సుజ‌నా ఎంట్రీ
- వెల్లంప‌ల్లిని సెంట్ర‌ల్‌కు మార్చి మ‌ళ్లీ మైనార్టీ నేత‌ను దింపిన జ‌గ‌న్‌
- సుజ‌నా దూకుడుతో వైసీపీ వార్ వ‌న్‌సైడ్ కాస్తా టైట్ ఫైట్‌

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
పైన అమ్మవారు.. కింద కమ్మవారు అంటూ దువ్వాడ జగన్నాథం సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ విజయవాడ వాసులకు సరిగ్గా సరిపోతుంది. విజయవాడలో కమ్మ సామాజిక వర్గం రాజకీయ ఆధిపత్యం ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం ఆర్యవైశ్య, మార్వాడి, మైనార్టీలు.. బీసీలలో నగర సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువగా ఉంటారు. వీరితోపాటు ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి.. అటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి.. చెందిన సెటిల‌ర్లు కూడా ఎక్కువగా ఇక్కడ నివసిస్తున్నారు. ఇక పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువగా మైనారిటీలు లేదా వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారే వరుసగా ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ఎన్డీఏ కూటమి తరపున కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరి బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు.

వాస్తవానికి ఈ సీటును జనసేన నుంచి గత ఎన్నికలలో పోటీ చేసిన పోతిన మహేష్ ఆశించారు. ఆయన బీసీ వర్గానికి చెందిన నేత. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీ తీసుకుంది. చివరి నిమిషంలో సుజనా చౌదరి బీజేపీ నుంచి పోటీలో ఉంటే.. పోతిన మహేష్ వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి కార్పొరేటర్ షేక్ ఆసిఫ్ ను జగన్ ప్రకటించారు. తొలినుంచి మైనారిటీ నియోజకవర్గంగా పేరున్న పశ్చిమలో 2014లో వైసీపీ నుంచి జలీల్ ఖాన్ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిన వెల్లంపల్లి శ్రీనివాస్ 2019లో వైసీపీ నుంచి విజయం సాధించారు. ఈసారి వెల్లంపల్లిని జగన్ సెంట్రల్ నియోజకవర్గంకు పంపి... మైనార్టీ వర్గానికి చెందిన ఆసిఫ్ కు ప‌శ్చిమం కేటాయించారు. మూడేళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేసిన వెల్లంపల్లి.. పశ్చిమ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్న విమర్శలు ఉన్నాయి.

వీటన్నింటికీ తోడు దుర్గ గుడిలో వెండి సింహాలు చోరీ, ఆలయంలో అక్రమాలు.. ప్రసాదం తయారీలో అవకతవకలు.. దసరా నవరాత్రుల సమయంలో కొండ నుంచి రాళ్లు కింద‌కు పడిపోవటం.. భవాని ఐలాండ్లో వైసీపీ నేతల పెత్తనం.. టీడీపీ నేతలతో పాటు సామాన్య ప్రజలపై వైసీపీ వాళ్లు దాడి చేయడం.. భూకబ్జాలు ఇలా చాలా ఆరోపణలు రావడంతోనే వెల్లంపల్లిని జగన్ పశ్చిమం నుంచి సెంట్రల్ కు మార్చారు. విద్యాసంస్థలు ఉన్న ఆసిఫ్ ఆర్థికంగా కూడా బలంగానే ఉన్నారు. అయితే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సుజన చౌదరి ఆర్థికంగా చాలా బలమైన నేత. పైగా పొలిటికల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో బాగా తెలుసు. ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు ఉన్న సుజన డబ్బులు ఖర్చు చేసే విషయంలో అస్సలు వెనక్కుతగ్గ‌రు అనే మాట ఉంది. కూటమి అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో సుజనా చౌదరికి కచ్చితంగా స్థానం ఉంటుంది అన్న ప్రచారం కూడా జరుగుతుంది.

ఇక్క‌డ క‌మ్మ వ‌ర్గం ఓటర్లు చాలా తక్కువ. అయితే సృజనా చౌదరికి వ్యక్తిగతంగా సౌమ్యుడు... ఎవరిపైనా దూకుడుగా వెళ్ళడు అన్న పేరు ఉంది. పైగా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుకు కావలసిన వ్యక్తి కావటం.. అటు జాతీయ‌ స్థాయిలో పరిచయాలు ఉండటం ఇవన్నీ సుజనాకు కలిసి వచ్చే అంశాలు. జనసేన నేత మహేష్ వైసీపీలో చేరటం.. కూటమికి కొంత ఎదురుదెబ్బ. ఇక టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ లాంటి నేతలు సుజనాకు మనస్ఫూర్తిగా సహకరిస్తే ఈసారి పశ్చిమంలో వైసీపీ గెలుపు అంత సులువు కాదనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు విజయవాడ పశ్చిమ వైసీపీకి వార్‌ వన్ సైడ్ అనుకుంటే.. గత వారం రోజుల నుంచి ఇక్కడ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సుజన గట్టి పోటీ ఇస్తుండడంతో ఫైటింగ్ హోరాహెరీ అనే కాడకు వచ్చేసింది. మరి కొండమీద ఉన్న దుర్గమ్మ వారి దయ సుజన, షేక్ ఆసిఫ్‌లలో ఎవరికి ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: