విశాఖ: కొణతాలపై కొండంత ఆశలు.. టూ మచ్?

Purushottham Vinay
విశాఖ: అనకాపల్లి అసెంబ్లీ సీటుకు ఎంతో మంది పోటీదారులు ఉన్నారు. రాజకీయంగా చూస్తే దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం చేసిన కొణతాల రామ కృష్ణ ఆలస్యంగా వచ్చినా లేటెస్ట్ అన్నట్లుగా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ని సాధించారు. అసంతృప్తులు అలకలు కూటమి చాటున సర్దుబాటు కాగా ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే కొణతాల నామినేషన్ దాఖలు చేయడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేయడం వరకూ బాగానే ఉంది. కానీ అపుడే కొండంత ఆశలు పెట్టుకొని ఆ ఆశలతో ఊహల పల్లకిలో ఊరేగడం మీదనే చర్చ సాగుతోంది. మా నేతే మంత్రి అవుతారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడమేంటి మంత్రి ఆయనే అని జోస్యం చెబుతున్నారు చాలా మంది.కానీ అనకాపల్లిలో చూస్తే పోటీ మాత్రం చాలా గట్టిగానే ఉంది అని తెలుస్తుంది. మూడు పార్టీల మధ్య కూడా ఈ ఓట్ల బదలాయింపు అనేది సాఫీగా సాగాల్సి ఉంది. అన్నీ జరిగి ఎమ్మెల్యే అయినా కూడా కూటమి రావాలి. ఆ మీదట జనసేన పార్టీ వాటాలో ఎన్ని మంత్రి పదవులు వస్తాయో చూడాలి. అవి కూడా విశాఖ జిల్లాలో తెలుగు దేశం పార్టీ కాకుండా ఇవ్వరు అన్నది గుర్తుంచుకోవాలి.


ఇక సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మంత్రి రేసులో తప్పకుండా ఉంటారు. అదే జిల్లాకు చెందిన పక్క నియోజకవర్గం వారికి మంత్రి పదవి ఎందుకు ఇస్తారు. ఇవన్నీ కూడా రాజకీయ సమీకరణలలో ఉంటాయి. ఏమీ కాకుండా మంత్రి అవుతారు అని కొణతాల వర్గీయులు ప్రచారం చేసుకోవడం ద్వారా అసలుకే ఎసరు తెచ్చేలా ఉన్నారని తెలుస్తుంది. మాటకు ఆ మాట చెప్పుకుంటే మాత్రం కొణతాల రాజకీయ సిరి ఉన్న నాయకుడు అని పేరు ఉంది. ఆయన 1989 వ సంవత్సరంలో కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో కాంగ్రెస్ నుంచి అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు కూడా చూస్తే రాజకీయంగా రిటైర్ అయిపోయారు అనుకున్న తరుణంతో తలుపు తట్టి మరీ పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా అదృష్టం కనుక కలిసి వస్తే ఏమైనా అవుతారు అని ఆయన వర్గం బల్ల గుద్ది మరీ చెబుతోంది. మరి చూడాలి అదృష్టం బాగా కలిసి వచ్చి గుర్రం ఎగురుతుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: