పల్నాడు : పౌరుషాల గడ్డపై గెలుపోటముల చరిత్ర..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎన్నికల సందడి కనబడుతుంది. అయితే ఎన్నికల పరంగా పల్నాడు జిల్లాలో పాలిటిక్స్ కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని నరసరావుపేట లోక్‌సభ పరిధిలోచాలా వరకు సామాజిక సమీకరణలు మారుతున్నాయి. గత ఎన్నికల్లో వైసిపి నుంచి ఎంపిగా గెలుపొందిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీకి ఇటీవల రాజీనామా చేసి టిడిపిలో చేరారు.అయితే ఆయన ప్రస్తుతం అక్కడే టీడీపీ నుండి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాయపాటి సాంబశివరావు వయోభారంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు.దాంతో ఈసారి ఆయనను అక్కడ నుండి తప్పించి లావుకే టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఇదిలా ఉంటే వైసిపి నుంచి నెల్లూరు ఎమ్మెల్యే పి అనిల్‌కుమార్‌ యాదవ్‌ బరిలో నిలిచారు. ఇండియా వేదిక నుంచి కాంగ్రెస్‌ తరఫున అలెగ్జాండర్‌ పోటీ చేస్తున్నారు. స్థానిక, స్థానికేతరులను ఆదరించిన ఘనత నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు దక్కింది.1952 నుంచి 2019 వరకూ 15 సార్లు జరిగిన ఎన్నికల్లో తొమ్మిది సార్లు కాంగ్రెస్‌, నాలుగు సార్లు టిడిపి, ఒకసారి వైసిపి, ఒకసారి ఇండిపెండెంటు గెలుపొందారు.
1971లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మద్ది సుదర్శనం స్వతంత్ర అభ్యర్థి వైవి నరసింహారావుపై గెలిచారు. 1977లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి బిఎల్‌డి అభ్యర్థి ఐ కోటిరెడ్డిపై గెలుపొందారు. 1980లో తిరిగి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి స్వతంత్ర అభ్యర్థి పోపూరి బ్రహ్మనందంపై గెలుపొందారు. 1984లో టిడిపి అభ్యర్థి కాటూరి నారాయణస్వామి కాంగ్రెస్‌ అభ్యర్థి కాసు బ్రహ్మానందరెడ్డిపై విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి కాసు కృష్ణారెడ్డి టిడిపి అభ్యర్థి పిడతల రంగారెడ్డిపై గెలుపొందగా, 1991లో కాసు కృష్ణారెడ్డి టిడిపి అభ్యర్థి అనిశెట్టి పద్మావతిపై రెండోసారి గెలుపొందారు. 1996లో టిడిపి అభ్యర్థి కోట సైదయ్య చేతిలో కాంగ్రెస్‌ అభ్యర్థి కాసు కృష్ణారెడ్డి పరాజయం పాలయ్యారు. 1998లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కొణిజేటి రోశయ్య టిడిపి అభ్యర్థి కోట సైదయ్యను ఓడించారు. 1999లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థి లాల్‌ జాన్‌బాషాపై గెలిచారు. 2004లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మేకపాటి రాజమోహన్‌ రెడ్డి టిడిపి అభ్యర్థి మద్ది లక్ష్మయ్యపై గెలుపొందారు. 2009లో టిడిపి అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బాలశౌరిపై గెలిచారు. 2014లో టిడిపి నుంచి పోటీ రాయపాటి సాంబశివరావు వైసిపి నుంచి పోటీ చేసిన ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డిపై గెలుపొందారు. 2019లో వైసిపి నుంచి పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు టిడిపి అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై గత ఏ ఎన్నికల్లో ఎవరికీ రాని విధంగా ఆధిక్యతతో లావు గెలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: