చంద్ర‌బాబు సొంత ఇలాకాలో ఇప్పుడు కూడా టీడీపీ గెల‌వ‌దా...!

RAMAKRISHNA S.S.
ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పూత‌ల‌ప‌ట్టు నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్‌గా మారింది.  ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన పూత‌ల‌ప‌ట్టులో టీడీపీ, వైసీపీ ల నుంచి పోటీ చేస్తున్న‌వారు.. ఇద్ద‌రూ నువ్వానేనా అన్న‌ట్టుగా ఉన్నారు. వైసీపీ నుంచి డాక్టర్ సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. ఆయన వృత్తి రీత్యా వైద్యుడు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ కలికిరి మురళీమోహన్ సైతం వృత్తి ప‌రంగా జర్నలిస్టు. వృత్తిప‌రంగా ఈయ‌న‌కు.. క్షేత్ర‌స్థాయిలో ప‌ట్టుంది. ప్రజల నాడి, ప్రజా సమస్యలపై అవ‌గాహ‌న కూడా ఉంది.  
పూతలపట్టులో 2009 నుంచి ఎన్నిక‌లు జరుగుతున్నాయి. అప్పుడు... కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్ పి.రవి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో డాక్టర్‌.సునీల్ కుమార్.. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి  గెలుపొందారు. అయితే... ఆయనపై పలు ఆరోపణలు రావడంతో.. వైసీపీ కేడర్‌ నుంచి సహకారం లభించలేదు. దీంతో, 2019 ఎన్నికల్లో డాక్టర్‌.సునీల్ కుమార్‌ను పక్కన పెట్టి... ఎంఎస్‌ బాబుకు అవకాశం ఇచారు. ఆ ఎన్నికల్లో ఎంఎస్‌  బాబు గెలుపు గుర్రం ఎక్కారు.
తాజాగా వైసీపీ మ‌రోసారి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్‌కు పిలిచి మ‌రీ అవకాశం ఇచ్చింది. ఇక‌, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.ఎస్‌బాబు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయ‌న కూడా ఇక్క‌డ పోటీ చేస్తున్నా.. పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక పోతున్నారు. ప్ర‌ధాన పోరు టీడీపీ-వైసీపీల మ‌ధ్యే ఉంద‌ని తెలుస్తోంది. దళిత ఓటర్లే కీల‌కంగా ఉన్నారు. 50 నుంచి 55 శాతం మంది దళిత ఓటర్లు ఉంటార‌ని అంచ‌నా. వీరిలో కూడా... అరవ మాల  సామాజిక వర్గానికి చెందిన వారిదే కీలకపాత్ర. వారి సంఖ్య 30 నుంచి 35 శాతం ఉంటుందని అంచనా.
రాష్ట్ర విభజన ముందు జరిగిన చివరి ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. విభజన తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ జెండానే ఎగిరింది. గత మూడు ఎన్నికల్లోనూ... టీడీపీ పార్టీ ప్రతిపక్ష పాత్రకే  పరిమితమైంది. ఈ నేప‌థ్యంలో నాలుగోసారి అయినా టీడీపీ విజయం సాధిస్తుంద‌నే అంచ‌నాల‌తో నాయ‌కులు తిరుగుతున్నారు. పైగా బీజేపీ, జ‌న‌సేన ద‌న్ను ఉన్న నేప‌థ్యంలో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.  ఇదే ధీమా వైసీపీలోనూ వినిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందోచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: