ప్రజలే కాంగ్రెస్ ను బండకేసి కొడతారు: హరీష్ రావు

మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో సమాజంలో సానుభూతి ఎక్కువ ఉందని అన్నారు. అందుకనే రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్‌ను సానుభూతితోనే గెలిపించారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలను చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టిందని హరీష్ రావు తెలిపారు. తాము కేడర్‌ను సన్నద్ధత చేయడంలో లోపం కూడా ఓ కారణం కావచ్చని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే కాంగ్రెస్‌లోకి వెళ్లారో.. వాళ్లంతా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా ఓటమిపాలవుతారని తేల్చి చెప్పారు. పదవి కోసం పార్టీ మారిన వాళ్లకి ప్రజలు సరైన బుద్ధి చెబుతారని అన్నారు. పార్టీ మారినవారి ఎన్నిక రద్దు కోసం స్పీకర్‌ను కలిసే ప్రయత్నం చేశామని.. కాని స్పీకర్‌ తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ తమ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని మండిపడ్డారు వాళ్ల ప్రభుత్వం కూలిపోవాలని తామెప్పుడు అనుకోలేదని ఇప్పుడు అనుకోవడం లేదని స్పష్టం చేశారు అలాగే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన తమ పార్టీకి లేదని స్పష్టం చేశారు.. కాంగ్రెస్‌ నిండు ఐదేళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.. అన్ని హామీలు అమలు చేసి సీఎం రేవంత్ రెడ్డి తమకంటే మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని.. అలాగే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని అన్నారు. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్‌ను ప్రజలే బండకేసి కొడతారని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకున్నారన్నారు. ముఖ్యంగా ఏ ఒక్క రైతు కంట నీరు రాకుండా పాలన సాగించారని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రజలు మంచి , చెడు ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: