పాట సెంటిమెంట్: రేవంత్ రెడ్డికి కలిసొచ్చింది..మరి జగన్ కి..?

Pandrala Sravanthi
సంగీతానికి రాళ్లయినా కరుగుతాయి అంటారు. కానీ ప్రస్తుత కాలంలో  అదే  సంగీతానికి రాళ్లేమో కానీ మనుషులైతే కరుగుతున్నారు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది ఆట పాటే. అలాంటి పాట ఇప్పుడు ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. పాట సక్సెస్ అయితే చాలు అభ్యర్థి కూడా సక్సెస్ అవుతున్నారు. అలాంటి పాట సెంటిమెంటు రేవంత్ రెడ్డికి బాగా కలిసి వచ్చింది. మరి ఈ ఎన్నికల్లో  ఆ పాట సెంటిమెంట్ జగన్ కు కలిసి వస్తుందా.? లేదా అనే వివరాలు చూద్దాం. నల్గొండ జిల్లాకు చెందిన ఫేమస్  ఫోక్ సింగర్ నర్సన్న. ఈయనను నల్గొండ గద్దర్ గా పిలుస్తారు. ఈయన గొంతు నుంచి జాలువారిన ఎన్నో పాటలు ప్రజలను పులకరింపజేశాయి.

 నల్గొండ గద్దర్ గొంతులో ఏముందో ఏమో కానీ రాజకీయ నాయకుల పాట పాడితే చాలు అది మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదించుకుంటుంది. ఆ పాట సక్సెస్ అయితే చాలు అభ్యర్థి తప్పనిసరిగా  గెలుస్తున్నారు. అయితే ఆయన తెలంగాణ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిపై ఒక అద్భుతమైన పాటను పాడారు. "మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలీనాడు ఒక్కడూ కాంగ్రెసూ సూర్యుడు మన రేవంతన్నా" అనే పాట కేవలం కాంగ్రెస్ నాయకులనే కాకుండా, ఎంతోమంది ప్రజలను  డాన్స్ ఆడేలా చేసింది.

ఈ పాట కొన్ని మిలియన్స్ వ్యూస్ సంపాదించి మంచి ఆదరణ పొందింది.  కాంగ్రెస్ ప్రతి ప్రచారంలో ఈ పాట లేనిది ప్రచారం నడిచేది కాదు.  ఆ విధంగా జనాల్లో ఎంతో పాపులర్ అయినటువంటి ఈ పాట సక్సెస్ తో ప్రజల్లోకి ఈ పాట తెచ్చుకొని పోయి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఓ భాగం అయింది.. అలాంటి నల్గొండ గద్దర్ ను ఏపీ సీఎం జగన్ సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానం చేశారు. అంతేకాకుండా తనకోసం ఒక ప్రత్యేకమైన పాట రాయించుకున్నారు.

ఇంతకీ ఆ పాట ఏంటంటే "జెండలు జత కట్టడమే నీ ఎజెండా జనం గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా..బలిరా బలి బలి రా" అనే పాట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో  ఎంతోమందిని  ఉర్రూతలూగిస్తోంది. మిగతా నాయకులు అందరి పాటల కంటే  ఈ పాట జనాల్లోకి బాగా కనెక్ట్ అయింది. ఎన్నికల ప్రచారంలో మొత్తం ఇదే పాట వినిపిస్తోంది. నాయకులు స్టెప్పులేస్తూ  ప్రచారంలో దూసుకుపోతున్నారు.  సోషల్ మీడియాలో అయితే ఈ పాట మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదిస్తోంది. అయితే అప్పుడు రేవంత్ పాట ఏ విధమైన ఆదరణ పొందిందో ఇప్పుడు జగన్ పాట కూడా అంతే ఆదరణ పొందుతూ దూసుకుపోతోంది. మరి రేవంత్ లాగా జగన్ కూడా పాట సెంటిమెంటుతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అవుతారా అని నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: