చిరు త్వరలో గాజు గ్లాసులో టీ తాగబోతున్నారా? భారీ విరాళం దేనికి సంకేతం?

Suma Kallamadi
మెగాస్టార్ చిరంజీవి గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. టాలీవుడ్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన చిరు అంటే తెలుగువాళ్ళకు ఓ ఎమోషన్. ఆయన డాన్స్ చేసినా, ఫైట్ చేసినా, డైలాగ్ చెప్పినా ఇక్కడ జనాలు పూనకంతో ఊగిపోతుంటారు. అలాంటి కాకలు తిరిగిన మెగాస్టార్ రాజకీయాల్లోకి వచ్చి కూడా అవి తనకి సరిపడవని అనతికాలంలోనే మరలా వెనక్కి వెళ్లి సినిమాలు చేసుకుంటున్నారు. అయితే అదే ఫ్యామిలీనుండి చిరు తమ్ముడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ సుదీర్ఘ రాజకీయాలను చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. అటు సినిమా రంగంలో అన్న మెగాస్టార్ స్థాయికి ఏమాత్రం తీసిపోని స్టార్ డం సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో మాత్రం అన్నను మించిపోయాడనే చెప్పుకోవచ్చు.
గత ఎన్నికల్లో అత్యంత దారుణమైన పరాజయం చవిచూసిన పవన్ కళ్యాణ్ ఈసారి కూటమి ఏర్పాటు చేసుకొని బరిలో దిగుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే, చిరు రాజకీయాలను వీడిన తరువాత సినిమా ప్రపంచానికే పరిమితం అయిపోయారు. తమ్ముడి పార్టీ పెట్టి నానా బాధలు పడుతున్నా ఈ తొమ్మిదేళ్లలో ఎక్కడా ఆయన పవన్ వంక చూసిన దాఖలాలు కనబడలేదు. అలాంటి చిరు తాజాగా జనసేన పార్టీకి 5 కోట్ల భారీ మొత్తం ప్రకటించడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది. దాంతో చిరంజీవి మద్దతు ఎప్పటికైనా తమ్ముడికే అని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
విషయం ఏమిటంటే.. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నట్టు లెక్క. అవును, చిరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్‌కు ఒక్క రూపాయి విరాళం ఇవ్వలేదు కానీ.. తన తమ్ముడి జనసేన పార్టీకి మాత్రం రూ. 5 కోట్లు విరాళం ఎలా ఇచ్చారు? అని ఓ వర్గంవారు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి చిరంజీవి ఇంకా కాంగ్రెస్‌లోనే ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దీంతోబాటు ఆయన్ను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా కూడా పలుమార్లు చెబుతూ వచ్చింది. మరోవైపు బీజేపీ, నరేంద్ర మోదీతో కూడా ఆయన మంచి సంబంధాలను కలిగి ఉండడం కొసమెరుపు. మొత్తానికి ఇప్పుడైతే ఆయన తమ్ముడికి మద్దతుగా ఆర్థిక సాయం అందజేశారు. దాంతో చిరంజీవి కేవలం విరాళంతో ముగిస్తారా? లేక జనసేన తరఫున ప్రచారం చేస్తారా? అనే చర్చ నెట్టింట జోరుగా ప్రచారం నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: