ఏపీ: కర్నూలులో టీజీ వెంకటేష్ వారసుడికి ఈసారి కలిసొచ్చేనా?

Suma Kallamadi
ఆంధ్ర రాజకీయాల్లో టీజీ వెంకటేష్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నేత. 1999లో టీడీపీ తరపున కర్నూలులో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతూ వున్నారు. కానీ ఆయన కుమారుడు మాత్రం టీడీపీనే అంటి పెట్టుకుని ఉండడం గమనార్హం. అవును, గత 2 దశాబ్దాలుగా కర్నూలు సిటీ రాజకీయాకి తండ్రీ కొడుకులు ఎనలేని సేవలు అందించారు. కాగా 2014 , 2019 ఎన్నికలలో స్వల్ప తేడాతోనే ఓడిపోవడం జరిగింది. 2019లో టీజీ భరత్ వైసీపీ వేవ్‌లో కేవలం ఐదు వేల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోవడం బాధాకరం. అయితే ఈ సారి మాత్రం అక్కడ ఎవరికీ ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ప్రత్యర్థితో బాగా తలపడుతున్నారు.
కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు మొదటినుండీ మంచి పట్టుంది. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండే కర్నూలులో ఈ సారి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ను వైసీపీ బరిలోకి దింపింది. కాగా గత ఎన్నికల్లో మైనార్టీ నేత హఫీజ్‌ఖాన్‌ను పోటీకి పెట్టింది ఫ్యాన్‌ పార్టీ. ఈ ప్రయోగం సక్సెస్‌ అవడంతో వరుసగా రెండోసారి కూడా కర్నూలు కోటను నిలబెట్టుకుంది వైసీపీ. అయితే ప్రస్తుత ఎన్నికల్లో రెండోసారి పోటీకి హఫీజ్‌ ఆసక్తి చూపినా.. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో విభేదాలు కారణంగా ఆయనను పక్కకు తప్పించడం జరిగింది. ఈ తరుణంలో కర్నూలులో అడుగుపెట్టిన వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్‌ కు 2 వర్గాలు సహకరించకపోవడం అక్కడ పెద్ద మైనస్ గా మారిందనే చెప్పుకోవాలి.
ఇదిలా ఉండగా టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న టీజీ భరత్‌ మాత్రం అక్కడ కాస్త దూకుడుగా ప్రచారం షురూ చేస్తున్నారు. గత ఎన్నికల్లో సుమారు 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన టీజీ భరత్‌ ఈ సారి సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకున్నట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైనా కర్నూలులో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు భరత్. నేను లోకల్‌… అంటూ ప్రచారం చేస్తున్న టీజీ భరత్‌ అధికార పార్టీ అభ్యర్థిని ఇరుకున పెడుతున్నట్టు కనబడుతోంది. వాస్తవానికి కర్నూలులో ముస్లిం ఓట్లు ఎక్కువ. ఆ తర్వాత ఎస్సీలు, వైశ్యులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. ఈ లెక్కలతోనే వైసీపీ మైనార్టీని… టీడీపీ వైశ్య సామాజిక వర్గం నేతను పోటీలోకి దించడం జరిగింది. ముస్లింలు ఎక్కువగా ఉన్నందున బీజేపీతో పొత్తు టీడీపీకి మైనస్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. కానీ వైసీపీ అభిమానులైన మైనార్టీ ఓటర్లు ఆ పార్టీకే ఓటు వేస్తారని.. ఆ పార్టీపై వ్యతిరేకత ఉన్న వాళ్లు తమకే ఓటు వేస్తారని టీడీపీ నేతలంటున్నారు. చూడాలి మరి గేమ్ ఎలా మారబోతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: