ఏపీ: జగన్ నాయకుడు కాదు, కరడుగట్టిన మద్యం వ్యాపారి: పవన్ కళ్యాణ్

Suma Kallamadi
ఆదివారం అనకాపల్లి వేదికగా జరిగిన వారాహి విజయభేరీ సభలో పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో ప్రసంగిస్తూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై, ఇంకా తన పార్టీలోని ముఖ్య నేతలపై విరుచుకు పడ్డారు. జగన్ అసలు ముఖ్యమంత్రే కాదని, కరడు కట్టిన సారా వ్యాపారి అని తీవ్రస్థాయిలో మండి పడ్డారు. విషయం ఏమిటంటే గత ఎన్నికల ప్రచారంలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని ప్రజలను నమ్మించిన జగన్ రెడ్డి తరువాత అమాయక జనాలను మోసగించి ఏకంగా ఆ మద్యం వ్యాపారం చేపట్టాడని అన్నారు. ఈ నేపథ్యంలో ఎంతోమంది అక్కా చెల్లెళ్ళ తాలు తెగిపోయాయని ధ్వజమెత్తారు. అదే విధంగా అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకు వచ్చేదని, కానీ ఇప్పుడు అనకాపల్లి పేరు వినగానే కోడిగుడ్డు గుర్తుకు వస్తోందంటూ మాజీ మంత్రి, వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్నాథ్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ సభా వేదికగా పవన్ జనసేన ప్రజలకోసం ఈరోజు ఏం చేసిందో గుర్తు తెచ్చారు. జనసేన పార్టీ ప్రజల కోసమే త్యాగం చేసిందని, ప్రతి పార్టీకి ఓ స్వార్థం ఉంటుందని, కానీ జనసేన ఆ పరిస్థితిని అధిగమించి రాష్ట్రం బాగుండాలని సీట్ల సర్దుబాటుకు ముందుకు వచ్చిందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తన ఒక్కడి ప్రయోజనాల కోసం అయితే తాను రాజకీయాల్లోకి రాలేదని, అలా అయితే సినిమాల్లోనే హాయిగా ఉంటుందని, ప్రజల భవిష్యత్తు బాగుండాలనే తాను పార్టీ పెట్టానని వివరించారు. మంత్రి పదవి మాత్రమే కోరుకుంటే, తనకు ఆ పదవి ఎప్పుడో లభించి ఉండేదని, కానీ తనకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం అని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా నొక్కివక్కాణించారు.
ఇక అనకాపల్లి స్థానం జనసేనదే అయినప్పటికీ, బీజేపీ అధిష్టానం అభ్యర్థన మేరకు సీఎం రమేశ్ అభ్యర్థిత్వాన్ని ఇక్కడ మనస్ఫూర్తిగా బలపరుస్తున్నామని, దానికి ప్రజలు తమ ఆమోదం మనస్ఫూర్తిగా తెలపాలని కోరారు. ఇక జగన్ ప్రభుత్వం పధకాల పేరుతో జనాలను మోసం చేసిందని సవివరంగా చెప్పుకొచ్చారు సేనాని. అమ్మఒడికి ఇచ్చిన నగదు రూ.19,600 కోట్లు అని పేరు చెప్పి మద్యాన్ని యదేశ్చగా అమ్ముతూ లక్షలకోట్ల కొల్లగొట్టాడని చెప్పుకొచ్చారు. నిజంగా జగన్ నాయకుడే కాదని, ఆ పదానికి అతను అస్సలు అర్హుడు కాదని... ఓ సారా వ్యాపారి, ఇక ఇసుక వ్యాపారి, భూములను కొల్లగొట్టే ఒక మోసగాడు ఈ జగన్ అంటూ విరుచుకుపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: