కాంగ్రెస్ : ఇందిరమ్మ నెగ్గిన స్థానంపై రేవంత్ కన్ను.. కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు బిగ్ ప్లాన్?

praveen
అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఘన విజయాన్ని సాధించడమే లక్ష్యంగా జోష్ లో ముందుకు సాగుతోంది. అయితే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుంచి కీలక నేతలందరినీ కూడా కాంగ్రెస్ గూటికి చేర్చుకుంటున్న రేవంత్ రెడ్డి.. గులాబీ దళపతి కేసీఆర్ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. కేసీఆర్ నమ్మిన బంటులుగా ఉన్న నేతలు సైతం ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇప్పటికే టిఆర్ఎస్ కీలక నేతలందరినీ కూడా హస్తం పార్టీలో చేర్చుకుని కేసీఆర్ ను దెబ్బ కొట్టిన రేవంత్.  ఇక ఇప్పుడు కెసిఆర్ కు ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్ స్థానంలో విజయం సాధించి మానసికంగా కూడా దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. అదే మెదక్ ఎంపీ సీటు. ఇది అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఎందుకంటే ఏకంగా దేశానికి రెండుసార్లు ప్రధాన మంత్రులను అందించింది. అదేంటి తెలుగుజాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు మాత్రమే కదా ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచి ప్రధాని అయింది అనుకుంటూన్నారు కదా.. ఆయనకంటే దాదాపు 8 ఏళ్ళ ముందు దివంగత నేత ఇందిరా గాంధీ ఉమ్మడి ఏపీ నుంచి ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యారు.

 1980లో ఇందిరా గాంధీ మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఒకే సమయంలో రాయ్ బరేలి నుంచి కూడా పోటీ చేశారు ఆమె. రెండు పార్లమెంట్ స్థానాలలో విజయం సాధించినప్పటికీ మెదక్ ను అంటిపెట్టుకొని ఉన్నారు. మెదక్ ఎంపీగా గెలిచి ప్రధానమంత్రిగా బాధ్యతలు  చేపట్టారు. 1984లో మెదక్ ఎంపీగా ఉండగానే ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు ఇందిరాగాంధీ. ఇలా మెదక్ ఎంపీ స్థానం చరిత్రలో నిలిచిపోయింది. ఇలాంటి చరిత్ర ఉన్న మెదక్ ఎంపీ స్థానం అటు బిఆర్ఎస్ అధినేత సొంత జిల్లాగా ఉంది. దీంతో ఇది కేసీఆర్కు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. అదే సమయంలో కాంగ్రెస్ కు ఇక్కడ ఈ ఎంపీ స్థానంలో విజయం ఎంతో ప్రతిష్టాత్మకమే.

 ఈ క్రమంలోనే ప్రస్తుత మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గతంలో మెదక్ ఎమ్మెల్యేగా పనిచేసిన రోహిత్ తండ్రి హనుమంతరావు తో ఇటీవల రేవంత్ చర్చలు జరిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మదును గెలిపించాలని ఆదేశాలు జారీ చేసారట. ఇక్కడ గెలిచి కేసీఆర్ మానసికంగా దెబ్బకొట్టాలని రేవంత్ అనుకుంటున్నారట. అయితే ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లో కేసీఆర్ ఇలాకగా పిలుచుకునే గజ్వేల్, ఇక హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సిద్దిపేట కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ గెలవాలంటే కాంగ్రెస్ కాస్త కష్టపడాల్సిందే. అలా అని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్కు అది పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఎవరు గెలుస్తారు అన్నది ఫైనల్ గా నిర్ణయించేది మాత్రం ఓటర్లే.. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: