ఏపీ: రచ్చలేపుతున్న వాలంటీర్లు... విజయవాడలో గుంపుగా తీర్మానం?

Suma Kallamadi
ఆంధ్రాలో ఎన్నికల వేళ ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోవడం ఇపుడు సర్వత్రా ఉత్కంఠకు దారితీస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు రాజీనామాలు చేసి అధికార వైసీపీకి మద్దతుగా నిలుస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో విజయవాడలో జరిగిన ఓ సంఘటన ఒకటి దీనికి పూర్తి విరుద్ధంగా మారడం కొసమెరుపు. అవును, అధికార వైసీపీకి మద్దతుగా ఉంటూ క్షేత్రస్ధాయిలో వారి అభ్యర్ధులకు ప్రచారం చేసిన వాలంటీర్లే ఇప్పుడు విజయవాడలో యూటర్న్ తీసుకున్నారని వినికిడి. అధికార వైసీపీని కాదని విపక్ష టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ల సంఘాల ప్రతినిధులు ఈ మేరకు విజయవాడలో సమావేశమై ఓ తీర్మానం చేశారు.
నిన్న విజయవాడలో జరిగిన వాలంటీర్ల సంఘం సమావేశంలో ఈ అనుకోని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటి వరకూ వైసీపీకి అండగా ఉంటున్న వాలంటీర్లు ఇకపై టీడీపీకి మద్దతివ్వాలని మూకుమ్మడిగా ఓ నిర్ణయానికి వచ్చారు. విషయం ఏమిటంటే, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతోపాటు నెలకు 50 వేలు ఆదాయం వచ్చేలా చూస్తానని చంద్రబాబు నాయుడు భరోసా ఇవ్వడంతో వాలంటీర్ల సంఘ ప్రతినిధులంతా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు భోగట్టా.
ఈ సందర్భంగా కొంతమంది వాలంటీర్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గడిచిన ఐదు సంవత్సరాలలో పనికిరాని సంక్షేమ పధకాలు తప్పితే ఎక్కడా అభివృద్ధిని నోచుకున్న పాపాన లేదని అన్నారు. అదే చంద్ర బాబు నాయుడు సీఎం అయితే పరిశ్రమలు వస్తాయని, తమ కుటుంబాల్లోని యువతకు ఉద్యోగాలు వస్తాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వారు భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అందుకనే టీడీపీ వెంటే వెళ్లాలని విజయవాడ వాలంటీర్లు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఇన్నాళ్లూ వైసీపీ కోసం పనిచేస్తే దక్కింది ఐదు వేలేనని, టీడీపీ అధికారంలోకి వస్తే తమతోపాటు కుటుంబాలు, రాష్ట్రం బాగుపడుతుందనే కారణాలతో వాలంటీర్లంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయం ఇపుడు అధికార పార్టీలో గుబులు పుట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: