తెలంగాణ: ఆఫీసు గేటు మార్చినంత మాత్రాన పార్టీ తలరాత మారుతుందా కేసీఆర్?

Suma Kallamadi
విషయం దేవుడికెరుక గానీ రాజకీయాల్లో వున్నవారు చాలామటుకు వాస్తును, జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతారనేది నిర్వివాదాంశం. అదే విధంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా అటువంటి వాటిపై ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భవన్ వాస్తుపై అయన ప్రత్యేక దృష్టిని సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణం వాయువ్య దిశలోని గేటు నుంచి రాకపోకలు సాగించడమే అనే వాస్తు పండితులు చెప్పిన సూచనతో భవన్ లో మార్పులు, చేర్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అవును, ఈశాన్యం నుంచి రాకపోకలు కొనసాగేలా కొత్తగా మార్పులు చేయాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడంతో ఈ మేరకు అవసరమైన మార్పులు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇకపోతే, హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఉన్న బీఆర్ఎస్ భవన్ తూర్పుకి అభిముఖంగా ఉండడం అందరికీ తెలిసిందే. అయితే ప్రవేశ ద్వారం వాయువ్యం నుంచి ఉండటం సరైంది కాదని, ఈశాన్యం నుంచి ఉండాలని పలువురు జ్యోతిష్యులు కేసీఆర్ కు సూచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ కొన్ని మార్పులు జరగనున్నాయని, వాస్తు ప్రకారం మార్పులు చేశాకే కేసీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్తారని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్తున్న సమయంలో వాస్తు మార్పులు ఊరట నిస్తాయని కేసీఆర్ అనుకుంటున్నాడేమోనని ఇపుడు వేడిగా నెట్టింట చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ వాస్తుమార్పులు దోహదం చేస్తాయని కేసీఆర్ నమ్మకంతో ఉన్నట్టున్నారు.
చాలామంది నాయకులలాగే కేసీఆర్ కు కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఎక్కువ అని అయన సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. ఈశాన్యం నుంచి రాకపోకలను కొనసాగిస్తే పార్టీ కార్యాలయం సమీపంలో ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుందని పార్టీ భావిస్తున్నట్టు భోగట్టా. కాగా బీఆర్ఎస్ కార్యాలయ వాస్తు దోషంపై ఆ పార్టీ నేతలు మాత్రం ఆశ్చర్యపోతున్నారట. గతంలో లేని మార్పులు ఇప్పుడెందుకని అన్నట్టుగా వారు గుసగుసలాడుకుంటున్నట్టు వినికిడి. ఎందుకంటే ఇదే కార్యాలయం వేదికగా వారు ఎన్నో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించారు కాబట్టి. ఏకంగా రెండు సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అధికారం కోల్పోగానే తప్పిదం.. వాస్తు దోషంలో ఉందని పేర్కొనటం చూసి విస్తుపోతున్నారు మరి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: