ఏపీ: పవన్‌ రాజకీయంలో పసలేదంటున్న విశ్లేషకులు?

Suma Kallamadi
జనసేనాని ఎప్పుడైతే ఒంటరిగా కాకుండా టీడీపీతో పొత్తు బాహాటంగా ప్రకటించాడో ఇక అక్కడి నుండి మొదలైంది అసలు కథ. ఈ ప్రకటన తరువాత తొలిసారి జనసైనికులు షాక్ తిన్నారు. ఆ తరువాత బీజేపీ కూడా కలవడంతో చాలామంది నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. అక్కడినుండి ట్విస్టుల మీద ట్విస్టులు. అవును, తాజాగా కూటమి రాజకీయంలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకోవడం గమనార్హం. అవనిగడ్డ సీట్ ఎవరికి దక్కుతుంది? తాజాగా పార్టీలోకి వచ్చిన నేతకి ఇస్తారా? జనసేన పార్టీకి చెందిన సీనియర్లకు అవకాశం ఇస్తారా? అనే ఉత్కంఠకు పవన్‌ తాజాగా తెరదించారు. అంతా అనుకున్నట్టుగానే అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరును పార్టీ అధినేత పవన్ ఖరారు చేశారు.
తొలి నుంచి అవనిగడ్డ సీటు తమకే కేటాయించాలంటూ స్థానిక నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి విదితమే. అంతే కాకుండా మొదట మండలి బుద్ధ ప్రసాద్‌కు టీడీపీ నుంచి కూడా అవనిగడ్డ సీటు దక్కలేదు. అయితే, చంద్రబాబు ప్లాన్‌లో భాగంగా ఆయన జనసేనలో చేరడం జరిగింది. దీంతో, కూటమి పొత్తులో భాగంగా ఆయనకే సీటు వచ్చేలా చంద్రబాబు ప్లాన్‌ చేసి టికెట్‌ ఇప్పించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో చంద్రబాబు ఉంటే తెరమీద పవన్‌ జస్ట్ నటిస్తున్నారంతే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. మరోవైపు.. మండలి బుద్ధప్రసాద్‌ జనసేనలో చేరిన నాటి నుంచి జనసేన టికెట్‌ ఆశించిన విక్కుర్తి శ్రీనివాస్, బండ్రేడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఇక, గతంలో కాంగ్రెస్, టీడీపీలో చాలా యాక్టివ్ గా పని చేసిన బుద్ధ ప్రసాద్.. ఇటీవల జనసేన పార్టీలో చేరారనే విషయం అందరికీ తెలిసినదే. ఇదిలా ఉంటే మిగిలిన పాలకొండ, విశాఖ సౌత్‌ స్థానాలకు సంబంధించిన అభ్యర్థి పేర్లపై పవన్‌ మరో 2 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. ఇక్కడ అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తూ పార్టీ నాయకులతో పవన్ చర్చిస్తున్నట్టు భోగట్టా. ఇక రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించిన విషయం విదితమే. ఈ విషయంలో టీడీపీ నుంచి అనుకూలత లేకపోవడంతో అభ్యర్థిని మార్చాలని నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేయడంతో మరి కొద్ది గంటలో రైల్వే కోడూరు స్థానం అభ్యర్థి మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: