ఏపీ: వైసీపీకి షాకిచ్చిన కిల్లి కృపారాణి?

Suma Kallamadi
కిల్లి కృపారాణి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసినదే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆమె తన ఉనికిని చాటుకున్నారు. అంతేకాకుండా ఓ సందర్భంలో ఓటమెరుగని ఎర్రన్నాయుడిని ఓడించి రికార్డు సృష్టించారు. అక్కడితో ఆగిపోకుండా ఏకంగా కేంద్రమంత్రిగా పనిచేసి ఉత్తరాంధ్ర రాజకీయాలను కేంద్రంలో వేడెక్కించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన పుణ్యమా అంటూ ఆమె పొలిటికల్ భవిష్యత్ ఒక్కసారిగా అయోమయంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు ఆమె వైసీపీలో చేరారు. టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డారు. అయినప్పటికీ వైసీపీలోనే కొనసాగారు.
ఇక ఏదో ఒక పదవి వస్తుందని ఆశించిన ఆమెకు ఆ పార్టీలో ఎటువంటి పదవి కాదు కదా కనీసం ప్రోటోకాల్ వెహికల్ కూడా ఏర్పాటు చేయడం జరగలేదు. ఇటువంటి పరిణామాల మధ్య కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ పూర్వ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి తిరిగి సొంతగూటికి చేరుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అనే వార్తలు గత కొంతకాలం నుండి మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. అధికార వైసీపీ పార్టీలో టెక్కలి అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆశపడి భంగపడిన ఆమె కాంగ్రెస్‌లో చేరి రాజకీయాల్లో చురుగ్గా ఉండేలా పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఆమె అధికార పార్టీ వైస్సార్సీపీకి రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చింది.
అయితే ఇది ఊహించిన పరిణామమే అని చెప్పుకోవాలి. ఆమె అధికార పార్టీలో అన్యాయంతో పాటు పలు సందర్భల్లో అవమానాలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. కాగా ఆమె ఇపుడు టెక్కలి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున అసెంబ్లీ బరిలో దిగుతున్నట్టు భోగట్టా. త్వరలో తెలంగాణా రానున్న కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వినికిడి. ఈ మేరకు కాంగ్రెస్‌లో చేరాలని ఆమెకు ఏఐసీసీ స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుల వరకు ఆహ్వానించినట్లు కూడా సమాచారం. ఇదిలా ఉండగా జిల్లాలో టెక్కలి మినహా మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: