ఏపీ: ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ ఓటమికి స్టార్ క్యాంపెయినర్లు వారేనా...?

Suma Kallamadi
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన బస్సు యాత్రలో చేస్తున్న వ్యాఖ్యలు మిస్ ఫైర్ అవుతున్నాయి. ముఖ్యంగా తమ వల్ల లబ్ధి పొందిన వారే తమకు స్టార్ క్యాంపెయినర్లు అని ఆయన ప్రకటించారు. తాము అమలు చేసిన పథకాలు తమను గెలిపిస్తాయని ఆయన నమ్మకంగా ఉన్నారు. అయితే సొంత జిల్లాలో రెండేళ్ల క్రితం జరిగిన ఘోర విషాధాన్ని అక్కడి ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. నవంబర్ 19, 2021న ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట సమీపంలోని అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగింది. దీంతో వరద నీరు సమీప గ్రామాలను ముంచెత్తింది. వరదల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రిజర్వాయర్‌ మండలంలో రోడ్డుపై వరద నీటిలో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులే ఎక్కువగా బాధితులు. తిండి గింజలు, ఇంట్లోని వస్తువులు, సర్వం కోల్పోయి వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. గుడారాల్లో బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీయసాగారు.
అలాంటి పరిస్థితుల్లో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. సొంత జిల్లా కావడంతో అక్కడి యాసలో బాధితులకు హామీలు ఇచ్చారు. తాను ఉన్నానని, తాను చూసుకుంటానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే విషాదం జరిగి రెండేళ్లు దాటింది. వరద బాధితులు తమకు సాయం అందక ఇబ్బందులు పడుతున్నారు. సొంత జిల్లాకే చెందిన సీఎం ఇచ్చిన హామీలు గంగలో కలిసిపోయాయి. తమను పరామర్శించిన సమయంలో ప్రజలు నిలదీయడంతో వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో కాంట్రాక్టర్ కేవలం పునాదుల వరకు ఇళ్లు నిర్మించి గాలికి వదిలేశారు. దీంతో దిక్కు తోచని పరిస్థితుల్లో వరద బాధితులు ప్రస్తుతం కాలం వెళ్లదీస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇచ్చిన టార్పాలిన్‌లతో గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. తమకు ప్రభుత్వం కొండంత సాయంగా నిలబడుతుందనుకుంటే తమను పట్టించుకోకుండా వదిలేసిందనే ఆవేదనతో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం ఏపీలో నడుస్తోంది. అందరికీ తాము సాయం చేశామని, పార్టీలు పట్టించుకోకుండా సంక్షేమ ఫలాలు అందించామని ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ ఊదరగొడుతున్నారు. అయితే సొంత జిల్లాలోని వరద బాధితుల సంగతేంటని ప్రతిపక్షాలు ఆయనను ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికీ వారి వైపు చూడలేదని విమర్శలు చేస్తున్నాయి. సొంత జిల్లాలోనే ఇలాంటి దుస్థితి ఉందని తూర్పారపడుతున్నాయి. కనీసం తమకు ఇళ్లు కట్టించకపోవడంతో దీనావస్థలో ఉన్న అన్నమయ్య డ్యామ్ వరద బాధితులు వైసీపీకి గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే సొంత జిల్లాలో వైసీపీకి పరాభవం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

YCP

సంబంధిత వార్తలు: