ఏపి: వలసలను ఆపుతా.. సీమ కన్నీళ్లు తుడుస్తా: చంద్రబాబు

Suma Kallamadi
వైసీపీ మీద మరోసారి తెదేపా నాయకుడు చంద్రబాబు తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. దానికి ఎమ్మిగనూరు పట్టణంలోని తేరుబజార్‌లో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభ వేదికైంది. ఇక్కడ మాట్లాడిన అయన, వైసీపీ హయాంలో తెచ్చిన ప్రాజెక్టులన్నింటిని వైకాపా నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా అయన కరవు నేలను సస్యశ్యామలం చేస్తాం అని మాటిచ్చారు. అదేవిధంగా వలసలు నివారిస్తాం అని కూడా చెప్పుకొచ్చారు. అయన మాట్లాడుతూ... "ప్రజల మద్దతు కోసమే ప్రజాగళం. ఎన్నికల వేడి వచ్చేసింది. జగన్‌ మోహన్‌ రెడ్డి ఇంటికి వెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది. ఇక మీరు పడిన బాధలకు విముక్తి అతి తొందరలోనే దొరుకుతుంది." అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
టీడీపీ అధికారంలోకి రాగానే నీటి వనరుల ప్రాజెక్టులు పూర్తి చేసి దశదిశ మారుస్తాం అని అక్కడి ప్రజలకు మాటిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి, మీనాక్షినాయుడు, మాచాని సోమనాథ్‌, ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, కోడుమూరు అభ్యర్థులు పార్థసారథి, వీరభద్రగౌడ్‌, రాఘవేంద్రరెడ్డి, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, గుడిసె కిష్టమ్మ, జడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు పుష్పవతి పాల్గోవడం ప్రత్యేకత సంతరించుకుంది. ఇక చంద్రబాబు నాయుడు రాకతో ఎమ్మిగనూరు పసుపు మయంగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. హెలిప్యాడ్‌ నుంచి బహిరంగ సభ జరిగిన తేరుబజారు వరకు తెదేపా జెండాలు, ఫ్లెక్సీలు రహదారి పొడవునా కట్టారు.
చంద్రబాబు హెలిప్యాడ్‌ నుంచి వాహనంలో బహిరంగ సభ స్థలానికి చేరుకోవడంతో తేరుబజారు వేల మందితో జనసంద్రంగా మారింది. గంటకుపైగా సాగిన చంద్రబాబు ప్రసంగాన్ని అక్కడి జనం ఆద్యంతం ఆసక్తిగా విన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు హ్యాండ్‌లూమ్‌ ఉంటే 200 యూనిట్లు, పవర్‌లూమ్‌ ఉంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామన్నారు. అదేవిధంగా చేనేత కార్మికులకు రాయితీ కింద ముడిసరకును ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అయన డ్వాక్రా సంఘాలు, ఆస్తిలో సమాన హక్కు, పాఠశాలల్లో 33 శాతం, కళాశాలలు, వంటగ్యాస్‌ ఇచ్చింది తెదేపానేనని గుర్తుచేశారు. వట్టి బటన్‌ కాదు, నిజమైన బటన్‌ నొక్కుతా అని చెబుతూ... 18 ఏళ్లు పైబడిన ఆడబిడ్డలకు నెలకు రూ.1500 చొప్పున ఇద్దరుంటే రూ.3 వేలు, అదేవిధంగా ముగ్గురుంటే రూ.4500, నలుగురంటే రూ.6 వేల చొప్పున ఇస్తామని, తల్లికి వందనం పేరుతో ఒక ఆడబిడ్డ ఉంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ఎంతమంది ఉంటే అంత మందికి షరతుల్లేకుండా ఇస్తామని చెప్పుకొచ్చారు. దాంతో జనాలు తమ కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: