చంద్రబాబు vs లారీ డ్రైవర్స్.. టిప్పర్ సైకిల్ ను నలిపేస్తుందా..?

frame చంద్రబాబు vs లారీ డ్రైవర్స్.. టిప్పర్ సైకిల్ ను నలిపేస్తుందా..?

ఎన్నికల సమయంలో నాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. ఒకసారి మాట్లాడితే వాటిని వెనక్కి తీసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. నోరు జారితే అసలుకే ఎస‌రు వస్తుంది. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే మారింది. అధికార వైసీపీ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం టికెట్ ను సాధారణ లారీ డ్రైవర్ వీరాంజనేయులు కి కేటాయించింది.


దీనిపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ సెటైర్లు వేశారు. జగన్ టిప్పర్ డ్రైవర్లకు వేలిముద్రగాళ్లకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇస్తేగిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు లేదా ఇతరులకు ఇవ్వాలి.. కానీ టిప్పర్ డ్రైవర్లకు టికెట్ ఇవ్వడం ఏంటని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చంద్రబాబుకు మైనస్ అయ్యేలా ఉన్నాయి.


రాష్ట్ర వ్యాప్తంగా లారీ డ్రైవర్లు.. లారీ అసోసియేషన్లు చంద్రబాబుపై మండిపడుతున్నాయి. టిప్పర్ డ్రైవర్ రాజకీయాల్లోకి రాకూడదా.. ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదా అని వారు ప్రశ్నిస్తున్నారు. గుంటూరులో రోడ్డుపై నిరసన వ్యక్తం చేసిన లారీ డ్రైవర్లు రాబోయే ఎన్నికల్లో టిప్పర్ సైకిల్ ను నలిపేస్తుందని హెచ్చరించారు. టిప్పర్ డ్రైవర్ అసెంబ్లీలో చంద్రబాబు పక్కన కూర్చోవడం ఆయనకు ఇష్టం లేదని... ఆయన ఓర్చుకోలేకనే ఈ వ్యాఖ్య‌లు చేశారని అన్నారు.


దళితుడు, డ్రైవర్ అయిన వీరాంజనేయులు ఎంఏ వరకు చదువుకున్నారని చెప్పారు. ప్రజా సేవ చేసేందుకు వీరాంజనేయులు రాజకీయాల్లోకి వస్తున్నాడని కచ్చితంగా గెలిచి తీరతాడని లారీ డ్రైవర్లు ధీమా వ్యక్తం చేశారు. చదువుకున్న వీరాంజనేయులుకు చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోవడంతోనే లారీ డ్రైవర్ గా మారారని చెబుతున్నారు.


కచ్చితంగా వీరాంజనేయులును గెలిపించుకుంటామని.. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వీరాంజనేయును గెలిపించేలా ఉన్నాయి. ప్రజల్లో సింప‌తీ వ‌ర్కౌట్ అయితే వీరాంజనేయులు గెలుస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: