నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ముగ్గురు ఫెయిల్యూర్స్ పోటీపడుతున్నారు. ఫెయిల్యూర్స్ అంటే రాజకీయాల్లో ఫెయిల్యూర్స్ కాదు.... కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు ఆ ముగ్గురే ఎంపీ స్థానానికి పోటీ పడుతుండడం చెప్పుకోదగ్గ విషయం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ స్థానానికి ఆయన పోటీ పడుతున్నారు. అదేవిధంగా బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు.
ఇప్పుడు బీజేపీ నుండి మళ్ళీ లోక్ సభ స్థానానికి పోటీ పడుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపో పోవడం విశేషం. ధర్మపురి అర్వింద్ కంటే ముందు నిజామాబాద్ లో కవిత ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో పసుపు బోర్డు హామీ ఇచ్చి అరవింద్ ఎంపీగా గెలిచారు. ఇక బీఆర్ఎస్ కంటే ముందు నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది.
దాంతో ఇక్కడ ఈ పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోరు కనిపించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ముగ్గురిలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండటం ... సీనియర్ నేత జీవన్ రెడ్డికి వివాద రహితుడుగా పేరు ఉండడంతో ఆయనకు కాస్త పాజిటివ్ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు జిల్లాలో బీజేపీ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ బిజెపి క్యాడర్ కాస్త బలంగానే ఉంది. దాంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల వరకు రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిజామాబాద్ గడ్డపై చివరికి ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి.