ఏపీ: రూటు మార్చిన జనసేన.. జేడీఎస్ తరహాలో రాజకీయాలు ఫలించేనా...?

Suma Kallamadi
ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ చేసే రాజకీయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన ఎన్నికల రణరంగంలోకి దూకిందతి. కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు బలం ఉన్న స్థానాల్లో మాత్రమే జనసేన బరిలోకి దిగుతోంది. సీట్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ గెలిచే స్థానాలను మాత్రమే ఆ పార్టీ తీసుకుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక జనసేన ప్రస్తుతం తన పంథా మార్చిందని, ఖచ్చితమైన రాజకీయ నిర్ణయాలతో దూసుకెళ్తోందని అంతా భావిస్తున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చేలా జనసేన విధానాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 21 అసెంబ్లీ సీట్లలో, 2 లోక్‌సభ నియోజకవర్గాలలో జనసేన పార్టీ పోటీ చేస్తోంది. ఈ సీట్లు రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి ఏ మాత్రం సరిపోవు. అయితే జనసేన మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. దీంతో కర్ణాటకలో జేడీఎస్ తరహా రాజకీయాలు పవన్ ఏపీలో చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. అక్కడే ఎక్కువ స్థానాలు తీసుకున్నారు.
2014లో ఏపీలో టీడీపీ, బీజేపీ కూటమికి జనసేన చీఫ్ పవన్ మద్దతు పలికారు. అయితే 2019లో ఆ రెండు పార్టీల కూటమికి వీడ్కోలు పలికి ఆయన వేరుగా పోటీకి దిగారు. కేవలం ఒక స్థానంలో మాత్రమే జనసేన గెలిచింది. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం పాలయ్యారు. ఓట్లు గణనీయంగా చీలడంతో అది వైసీపీకి బాగా లాభించింది. 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో జట్టు కడితేనే తాము నెగ్గుకు రాగలమన్న సత్యాన్ని పవన్ గ్రహించారు. బీజేపీని, టీడీపీ ఒప్పించి కూటమి ఏర్పాటయ్యేందుకు కృషి చేశారు. తొలుత 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయడానికి అంతా రంగం సిద్ధమైంది. ఆ తర్వాత పరిణామాలతో 3 అసెంబ్లీ సీట్లను, ఒక ఎంపీ స్థానాన్ని బీజేపీకి జనసేన త్యాగం చేసింది. జనసేన తరుపున ఇప్పటి వరకు 18 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను పవన్ ప్రకటించారు. వారిలో 9 మంది కాపు సామాజిక తరగతికి చెందిన వారు ఉన్నారు. మూడు ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లోనూ జనసేన బరిలోకి దిగుతోంది. బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, గవర సామాజిక వర్గాలకు చెందిన ఒక్కొక్కరిని జనసేన బరిలోకి దింపింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 5, పశ్చిమ గోదావరి జిల్లాలో 6, విశాఖ జిల్లాలో 4 స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. ఈ జిల్లాలో కాపు సామాజికవర్గం అధికంగా ఉంది. పవన్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు వారి నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. దీంతో ఈ మూడు జిల్లాల్లో జనసేన బరిలోకి దిగి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: