ఆంధ్రప్రదేశ్: ఎమ్మిగనూరులో భగ్గుమన్న టీడీపీ - జనసేన మధ్య విభేదాలు..?!

Suma Kallamadi
ఏపీలో కూటమిగా బరిలోకి దిగిన టీడీపీ, జనసేన మధ్య విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. పై స్థాయిలో నాయకులు కలిసినా, కార్యకర్తలు మాత్రం కలవలేకపోతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనల్లో ఈ విషయాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. టికెట్ల కేటాయింపుతో పలు చోట్ల టీడీపీ, జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రస్తుతం అవి తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా రాయలసీమలోని ఎమ్మిగనూరులో పరిస్థితిని చూసి టీడీపీ, జనసేన నాయకులు తలలు పట్టుకుంటున్నారు. సమన్వయ లేమి కారణంగా ఇరు పార్టీల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి ముందుకు సాగడంపై ఎక్కడికక్కడే సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో ఆదివారం పర్యటించనున్నారు. ఇందుకోసం మధ్యాహ్నం ప్రజాగళం పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభలో జనసేన నేతలు పాల్గొంటారా లేదా అనే విషయంపై స్పష్టత కొరవడింది.
రాయలసీమలో చంద్రబాబు, కోస్తా ప్రాంతంలో పవన్ కళ్యాణ్ తమ పర్యటనలను ప్రారంభించారు. అయితే రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినా క్షేత్రస్థాయిలో నాయకులు కలవడం లేదనే ప్రచారం సాగుతోంది. ఒక పార్టీ నిర్వహించే కార్యక్రమానికి మరో పార్టీకి ఆహ్వానం రావడం లేదనే విమర్శలున్నాయి. ముఖ్యంగా ఎమ్మిగనూరులో చంద్రబాబు ప్రజాగళం సభకు జనసేన నేతలకు ఎవరూ ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు సభకు తాము దూరంగా ఉండాలనే నిర్ణయానికి జనసైనికులు వచ్చారు. అయితే ఇప్పుడైనా టీడీపీ నేతలు తేరుకుని జనసేన నేతలకు ఆహ్వానం పంపుతారా లేక వారిని పక్కన పెడతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.


 చంద్రబాబు ప్రజాగళం సభను విజయవంతం చేయాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్ధి బీవీ జయనాగేశ్వరరెడ్డి తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే కూటమిలో భాగమైన జనసేన నేతలకు కనీస ఆహ్వానం పంపకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. జనసేన నేతలకు టీడీపీ నేతలు గుర్తింపు ఇవ్వడం లేదనే వాదన వినిపిస్తోంది. కోస్తా జిల్లాల్లో తప్పితే రాష్ట్రంలో ఆ పార్టీకి మిగిలిన చోట్ల బలమైన క్యాడర్ లేకపోవడం ఒక మైనస్‌గా మారింది. అయితే గెలుపోటములు ప్రభావితం చేసే పార్టీ కావడంతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. తీరా ఎన్నికల వేళ జనసేన నేతలకు టీడీపీ కలుపుకుపోవడం లేదనదేది ప్రధాన విమర్శ. ఇవాల జరిగే చంద్రబాబు సభలో జనసేన దూరంగా ఉండాలని నిర్ణయించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: