పవన్: పిఠాపురం పర్యటనలో తొలిరోజే షాక్‌ ?

Chakravarthi Kalyan
తాను పోటీ చేయబోయే స్థానం పిఠాపురం అని ప్రకటించిన పవన్ కల్యాణ్.. తాజాగా ఆ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటనకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 30 నుంచి ఆయన ప్రచార పర్వంలోకి దిగారు. ఆ ప్రచార కార్యక్రమానికి వారాహి విజయభేరి అని నామకరణం చేశారు.

కాకపోతే ఆదిలోనే హంసపాదు అనే మాదిరిగా ఆయనకు తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. పవన్ నిర్వహించే వారాహి సభకు పోలీసులు బ్రేకులు వేశారు.  అవును.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే జగన్ మేమంతా సిద్ధం, చంద్రబాబు ప్రజా గళం అని ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కల్యాణ్ సైతం వారాహి విజయ భేరి అని తాను సైతం కదన రంగంలోకి అని ప్రచార కార్యక్రమానికి తెర లేపారు.

తొలి సభను శనివారం సాయంత్రం 30న చేబ్రోలు రామాలయం సెంటర్ లో ప్రారంభించాలని ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే దీనికి పోలీసులు ముందస్తు అనుమతి లేదని వారాహి వాహనానికి అనుమతి నిరాకరించారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోలేదని పోలీసులు వివరించారు. ఈ సందర్భంగా వారాహి వాహనంపై నిల్చొని మాట్లాడవద్దని షరతులు విధించారు.  ఇదే సందర్భంలో చిన్నపాటి వాహనానికి మాత్రం అనుమతి ఇచ్చారు.

అయితే పవన్ కల్యాణ్ ఉదయమే పిఠాపురం చేరుకున్నా ముందుగా టీడీపీ నేత వర్మ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించి ఆ కుటుంబం ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం స్థానిక దత్తపీఠంలో అమ్మవారి దర్శనం, వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలో గుడి మూసి ఉండటంతో సాయంత్రానికి పూజా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.  కానీ పోలీసులు వీరికి ఈ రకంగా షాక్ ఇచ్చారు. వాస్తవానికి సీఎం జగన్ అయినా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు అయినా ముందస్తు అనుమతి తీసుకుంటారని.. దీనికి సంబంధించిన ఫార్మాలటీస్ అన్నీ వాళ్ల అనుచరులు చూసుకుంటారు. కానీ పవన్ విషయంలో అలా జరగలేదు. అందుకే పోలీసులు అనుమతిని నిరాకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: