ఉత్తరాంధ్ర : మేనేజ్మెంట్ కోటాలో టికెట్ ఖాయమా ?
ఒక పార్లమెంటు సీటులో టికెట్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు. అయితే మ్యానెజ్మెంట్ కోటాలో టికెట్ ఒకళ్ళకి రిజర్వు అయిపోతే మిగిలిన ముగ్గురు ఏమిచేయాలి ? ఇపుడీ విషయంపైనే చర్చ జరుగుతోంది జనసేనలో. ఇంతకీ విషయం ఏమిటంటే ఉత్తరాంధ్రలో అనకాపల్లి పార్లమెంటు సీటులో పోటీచేయటానికి తెలుగుదేశంపార్టీలో ఇద్దరు నేతలు సీరియస్ గా ట్రై చేసుకుంటున్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడి కొడుకు చింతకాయల విజయ్, బైరా దిలీప్ చక్రవర్తి ఇద్దరు టికెట్ తనకంటే తనకే అని నియోజకవర్గంలో తిరిగేస్తున్నారు.
అయితే ఈమధ్యనే మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ జనసేన వైపునుండి ఎంట్రీ ఇచ్చారు. స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆహ్వానించటంతో కొణతాల పార్టీలో చేరారు. చేరేముందే అనకాపల్లి ఎంపీ టికెట్ హామీ తీసుకునే చేరారు. దాదాపు పదేళ్ళుగా స్తబ్దుగా ఉంటున్న కొణతాల మళ్ళీ రాజకీయంగా యాక్టవ్ అయ్యే ఉద్దేశ్యంతోనే జనసేనలో చేరారు. టీడీపీ మిత్రపక్షం కాబట్టి ఈజీగా గెలిచేయచ్చని అనుకున్నారు. కొణతాల చేరారు కాబట్టి అనకాపల్లి పార్లమెంటులో జనసేనే పోటీచేస్తుందనే ప్రచారం మొదలైపోయింది.
దాంతో ముగ్గురి మధ్య టికెట్ ఎవరికి అనే సస్పెన్స్ పెరిగిపోతోంది. సరిగ్గా ఈ సమయంలో నాలుగో వ్యక్తి మేనేజ్మెంట్ కోటాలో నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఇంతకీ ఆయన ఎవరంటే పవన్ సోదరుడు, జనసేన ప్రధానకార్యదర్శి నాగబాబు. రాజకీయంగా పెద్ద నేపధ్యం లేకపోయినా పవన్ సోదరుడనే ట్యాగ్ ఉంది కదా దాంతో చెలామణి అయిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో అనకాపల్లిలో నాగబాబే పోటీచేయబోతున్నారని పార్టీలో టాక్ పెరిగిపోతోంది. దానికి తగ్గట్లే నాగబాబు కూడా అనకాపల్లి పార్లమెంటు మీదే ఎక్కువగా దృష్టిపెట్టారు. ఎలాగూ నాగబాబుకు పోయిన ఎన్నికల్లో నరసాపురంలో ఓడిపోయిన అనుభవం ఉంది. అందుకనే రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం జాగ్రత్తగా పావులు కదుపుతున్నారట.
జనసేనలో టికెట్ కోసం పవన్ సోదరుడనే ట్యాగ్ కు మించిన అర్హత ఏముంటుంది ? అందుకనే అనకాపల్లి టికెట్ నాగబాబుకే ఫైనల్ అయిపోయిందనే టాక్ పెరిగిపోతోంది. పార్లమెంటు పరిధిలోని పాయకరావుపేట, పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల్లో సమీక్షలు కూడా పెట్టుకున్నారు. ఇదివరకే ఒకసారి నేతలతో సమావేశమైన నాగబాబు మళ్ళీ కలుస్తున్నారు. దాంతో టికెట్ విషయంలో మిగిలిన ముగ్గురికి ఏమిచేయాలో దిక్కుతోచటంలేదు.