మోడీ, నిర్మల.. మరీ ఇలా చేస్తారనుకోలేదు?

Chakravarthi Kalyan
ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ లో ఉద్యోగులకు ఊరట కల్పించే అంశాలేమీ కనిపించలేదు. గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మధ్యంతర బడ్జెట్ లో కొత్త  పన్ను ప్రతిపాదనలేమీ తీసుకురావడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దిగుమతి సుంకాలు సహా, ప్రత్యక్ష, పరోక్ష  పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రకటించారు.

గత అయిదేళ్లలో పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడంపై దృష్టి సారించామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఫేస్ లెస్ అసెస్ మెంట్ అప్పీల్ ను ప్రవేశ పెట్టడంతో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందన్నారు. నవీకరించిన ఆదాయపు పన్ను, రిటర్నులు, కొత్త ఫారం 26ఏస్, పన్ను రిటర్నులను ముందుగానే నింపడం లాంటి వాటి ద్వారా రిటర్నుల దాఖలు మరింత సులభం అయ్యాయని పేర్కొన్నారు.  రిటర్నుల పరిశీలనకు 2013-14లో సగటున 93 రోజులు పట్టేదని.. ఇప్పుడు కేవలం పది రోజుల్లోనే ఇది పూర్తవుతుందని తెలిపారు. దీనివల్ల రిఫండుల చెల్లింపు వేగంగా పూర్తవుతుందన్నారు.

వివాదాస్పదమైన ప్రత్యక్ష పన్ను డిమాండ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. 1962 నుంచి ఇవి ఇంకా డిమాండ్ పుస్తకాల్లోనే కొనసాగుతూనే ఉన్నాయి. నిజాయతీతో పన్ను చెల్లిస్తున్న వారికి ఇవి ఆందోళన కలిగిస్తున్నాయి. తదుపరి సంవత్సరాల్లో రిఫండుకూ ఇబ్బంది అవుతోంది.  ఈ నేపథ్యంలో 2009-10 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న రూ.25 వేల లోపు డిమాండు నోటీసులకు, 2010-11 నుంచి 2014-15 వరకు ఉన్న రూ.10వేల లోపు ప్రత్యక్ష పన్ను బకాయి నోటీలసులను ఉపసంహరించుకోవాలని ప్రతిపాదిస్తున్నా అని సీతారామన్ తెలిపారు.

దీనివల్ల కోటిమందికి ప్రయోజనం పొందుతారని వెల్లడించారు.  వీరందరూ రూ.3500 కోట్ల మేర లబ్ధి పొందుతారని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. మరోవైపు గత పదేళ్లలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయని... రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 2.4 రెట్లు అధికమైంది అని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: