అమరావతి : ప్రయారిటి అంతా అసెంబ్లీ స్ధానాలకేనా ?

Vijaya

వైసీపీలో విచిత్రమైన పరిస్ధితి పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుపుకోసం జగన్మోహన్ రెడ్డి రకరకాల వ్యూహాలను అమలుచేస్తున్నారు. ఇందులో కొన్ని  అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్తవారిని ఎంపికచేస్తున్నారు. మరికొందరు ఎంఎల్ఏలకు నియోజకవర్గాలను మారుస్తున్నారు. ఇంకొందరు ఎంఎల్ఏలను ఎంపీలుగా పోటీచేయిస్తున్నారు. అలాగే కొందరు ఎంపీలను అసెంబ్లీలకు పోటీచేయిస్తున్నారు. జరుగుతున్న మార్పులు చేర్పులన్నీ మొత్తం జగన్ తలనొప్పనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ ఓడినా గెలిచినా మొత్తం బాధ్యతంతా జగన్ దే కాబట్టి.



అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే కొందరు ఎంఎల్ఏలను ఎంపీలుగా పోటీచేయమంటే ఇష్టపడటంలేదు. వాళ్ళ దృష్టంతా అసెంబ్లీకి పోటీచేయటం మీదే ఉంటోంది. జీడీ నెల్లూరు ఎంఎల్ఏ, ఉపముఖ్యమంత్రి నారాయణస్వాని చిత్తూరు ఎంపీగా పోటీచేయమన్నారు. సత్యవేడు ఎంఎల్ఏ ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీగా పోటీచేయమని చెప్పారు. ఆలూరు ఎంఎల్ఏ, మంత్రి గుమ్మనూరు జయరామ్ ను కర్నూలు ఎంపీగా పోటీచేయమని చెప్పారు. అయితే వీళ్ళలో ఎవరూ ఎంపీలుగా పోటీచేయటానికి ఇష్టపడలేదు.



ఆదిమూలం ఏకంగా పార్టీనే మారిపోయారు. మార్పులు చేర్పుల్లో నారాయణస్వామిని చిత్తూరు ఎంపీ స్ధానం నుండి మళ్ళీ జీడీ నెల్లూరు అసెంబ్లీకే పోటీచేయిస్తున్నారు. ఇక జయరామ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న కారణంగా ఇప్పటికి ఎక్కడా టికెట్ ఇవ్వలేదు. విషయం ఏమిటంటే కొత్తవాళ్ళకి ఎంపీలుగా పోటీచేసే అవకాశం కల్పిస్తుంటే మాత్రం హ్యాపీగా ఫీలవుతున్నారు. అలాగే ఎంపీలను అసెంబ్లీలకు పోటీచేయమంటే రెడీ అయిపోతున్నారు. అలాగే సర్వేల ఆధారంగా ఎంఎల్ఏలకు  నియోజకవర్గాలకు మార్చుతుంటే మొదట్లో బెట్టుచేసినా తర్వాత ఓకే అంటున్నారు.



దీనికి కారణం ఏమిటంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకమే. ఎంపీలుగా గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే గెలిచినా పెద్దగా  ఒరిగేదేమీ ఉండదు. అందుకనే నేతల చూపంతా ఇపుడు పార్లమెంటు నియోజకవర్గాల మీద కాకుండా అచ్చంగా  అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయటం పైన మాత్రమే ఉంది. మొత్తంమీద వైసీపీలో అసెంబ్లీ టికెట్లకోసం విపరీతమైన పోటీ ఉన్నట్లు అర్ధమైపోతోంది. మరి ఎంపీలుగా ఎవరు పోటీచేస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: