బీసీ సంక్షేమసంఘం యువజన జాతీయ అధ్యక్షుడిగా గవ్వల భరత్

Chakravarthi Kalyan
బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా యువ నాయకుడు గవ్వల భరత్ కుమార్ ఎంపికయ్యారు. హైదరాబాద్ లో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ హనుమంత రావు, బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరుల సమక్షంలో భరత్ కుమార్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ పట్టణానికి చెందిన భరత్ కుమార్ అనేక సామాజిక ఉద్యమాల్లో పని చేశారు. బీసీల అభ్యున్నతి కోసం ఆర్ కృష్ణయ్య చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో చేరారు.

యువ నాయకుడు భరత్ కుమార్ కు శుభాకాంక్షలు చెప్పిన ఆర్ కృష్ణయ్య.. బీసీల అభ్యున్నతికి విశేషంగా కృషి చేయాలన్నారు. అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో బీసీ ఉద్యమం బలంగా ఉందని, అందుకే బీజేపీ పార్టీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిందని ఆర్ కృష్ణయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ జనగణన చేస్తామని ప్రకటించిందని.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడే తీరు బీసీల విశ్వాసాన్ని చూరగొంటున్నదని, రాహుల్ గాంధీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆర్ కృష్ణయ్య అన్నారు.

అన్ని రంగాల్లో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తాము ఉద్యమాలు చేయడం వల్లనే దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేలాది బీసీ హాస్టళ్లు ఏర్పాటయ్యాయని, అనేక మందికి స్కాలర్ షిప్ లు అందుతున్నాయని ఆర్ కృష్ణయ్య వివరించారు. ఉద్యమిస్తేనే ప్రభుత్వాలు దిగొస్తాయని, ప్రజాస్వామికంగా పోరాటం చేసి బీసీ రిజర్వేషన్ చట్టాన్ని సాధిస్తామని ఆర్ కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాధికారంలో బీసీలకు న్యాయమైన వాటా ఉండాలని, బీసీలకు రాజ్యాధికారం వస్తే అర్థికంగా కూడా ఎదుగుతారని, కాబట్టి ఓటు విలువ తెలుసుకోవాలని ఆర్ కృష్ణయ్య తెలిపారు.

బీసీల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న పోరాటయోధుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో చేరడం సంతోషంగా ఉందని గవ్వల భరత్ కుమార్ అన్నారు. తనను యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమించినందుకు గవ్వల భరత్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bc

సంబంధిత వార్తలు: