ఇండియాలో ముస్లింలు ప్రశాంతంగా బతుకుతున్నారా?
వివక్ష లేని సంపూర్ణ, సురక్షిత ప్రశాంత జీవనాన్ని ముస్లింలు భారతదేశంలో గడుపుతున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇతర దేశాల్లో హింసా పీడితులకు గురువుతున్న మైనార్టీ సమూహాలకు భారత్ స్వర్గధామాన్ని తలపిస్తోందన్నారు. బ్రిటన్ కేంద్రంగా ప్రచురిస్తున్న వాణిజ్య పత్రిక ద ఫైనాన్షియల్ టైమ్స్ కు మోదీ ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేస్తున్నారన్న విమర్శలను ఈ సందర్భంగా ప్రధాని ఖండించారు. యథేచ్ఛగా విమర్శించే హక్కు కలిగిన స్వేచ్ఛా వాతవరణాన్ని వారు ఉపయోగించుకుంటున్నారు.
భారత్ లో ముస్లింల భవిష్యత్తు గురించి ప్రశ్నించగా దానికి సమాధానం ఇవ్వడానికి బదులు పార్శీల ఆర్థిక విజయాలను ప్రస్తావించారు. వీరు దేశంలోనే అతిచిన్న మైనార్టీ సమూహమైన ఆర్థికంగా గొప్పగా ఎదిగారని వివరించారు. 2023 ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 20 కోట్ల మంది అంటే దేశ జనాభాలో 14.28 శాతం మంది ముస్లింలు నివసిస్తున్నారు. భారత్ లో ముస్లింలకు వ్యతిరేకంగా ఎటువంటి వివక్షలు చూపడం లేదని తేల్చి చెప్పారు.
ముస్లింల మైనార్టీ హక్కులు స్థితిని మెరుగు పరిచేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అని ప్రశ్నించగా వాటికోసం ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు అవసరం లేదన్నారు. 1947లో భారత్ దేశాన్ని వదిలి వెళ్తూ బ్రిటిష్ పాలకులు భవిష్యత్తుపై భయాందోళనలను వ్యక్తంచేశారు. వారివి వట్టి ఊహలే అని ఆ తర్వాత చరిత్ర నిరూపించింది. గతంలో జరిగిన పరిణామాలు అవాస్తవాలు అని భవిష్యత్తులో తెలుస్తుంది అని మోదీ వ్యాఖ్యానించారు. కష్టపడితే ఎవరికి అయినా ఫలితం ఉంటుందని వివరించారు.