అమరావతి : ఈ సర్వేలను నమ్ముకుంటే అంతేనా ?
రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని చెప్పే ఒక సర్వే ఇపుడు కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు వస్తే ఏపీలో ఏ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందనే విషయమై టైమ్స్ నౌ-ఈటీజీ అనే మీడియా, సర్వే సంస్ధలు సర్వే చేశాయి. ఈ సర్వే ప్రకారం 25 లోక్ సభ సీట్లలో వైసీపీకి 24 లేదా 25 సీట్లు గెలుస్తుంది. టీడీపీకి ఒక్క సీటు గెలిచే అవకాశం ఉందని తేలింది. ఇక జనసేన అయితే రాబోయే ఎన్నికల్లో కూడా బోణికొట్టడం అసాధ్యమని తేలిపోయింది.
మిగిలిన అంటే బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు. కాబట్టి వైసీపీకి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తిరుగులేదని సర్వే తేల్చేసింది. అయితే ఇక్కడ రెండు సందేహాలున్నాయి. అవేమిటంటే మొదటిదేమో ఏపీలో పార్లమెంటు ఎన్నికలు ఒకటే కాదు జరిగేది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కలిసే జరగబోతున్నాయి. అలాంటపుడు కేవలం పార్లమెంటు ఎన్నికల గురించి మాత్రమే సర్వే చేయటం ఏమిటి ? అసెంబ్లీ ఎన్నికల సంగతేమిటి ?
అలాగే రెండో సందేహం ఏమిటంటే టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీచేస్తాయి. అలాంటపుడు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ప్రాతిపదికమీద సర్వే చేయటం ఏమిటో అర్ధంకావటంలేదు. వైసీపీ-టీడీపీ+జనసేన పార్టీల్లో దేనికెన్ని సీట్లు వస్తాయని సర్వే చేస్తే బాగుండేది. రెండుపార్టీలు ఒకటిగా పోటీచేయాలని డిసైడ్ అయిన తర్వాత టైమ్స్ నౌ విడివిడిగా పోటీచేస్తే అని సర్వేచేయటంలో అర్ధమేలేదు.
బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల బలం గురించి అందరికీ తెలిసిందే కాబట్టి దీని కోసం ప్రత్యేకించి సర్వేనే అవసరంలేదు. కాకపోతే తాజా సర్వే వివరాలను నమ్ముకుంటే మాత్రం వైసీపీ మీద దెబ్బపడిపోవటం ఖాయం. ఎందుకంటే ప్రీపోల్ సర్వేలు ప్రతిసారి నిజాలవుతాయనే గ్యారెంటీ లేదు కాబట్టే. ఏదేమైనా రాబోయే ఎన్నికలు ఇటు జగన్మోహన్ రెడ్డితో పాటు అటు చంద్రబాబునాయుడికి కూడా జీవన్మరణ సమస్యలాంటిదనే చెప్పుకోవాలి. అందుకనే పోటీ చాలా టైటుగా ఉంటుందనే అనుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.