హైదరాబాద్ : ముందే పోలింగ్ ఎందుకు ముగిసిందో తెలుసా ?

Vijaya

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో మామూలుగా అయితే 5 గంటలకు పోలింగ్ ముగియాలి. కానీ ఇందులోని 11 నియోజకవర్గాల్లో మాత్రం గంటముందే అంటే సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించేశారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఈ నియోజకవర్గాలు ఉండటమే. ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని నియోజకవర్గాలపై కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రత్యేక దృష్టిపెట్టింది.



మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలు చెన్నూరు, సిర్పూరు, ఆదిలాబాద్, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, ములుగు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఇల్లందు, అసిఫాబాద్, భద్రాచలంలోని 3341 పోలింగ్ కేంద్రాల్లో 4 గంటలకే పోలింగును ముగించేయాలని గతంలోనే కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశించింది. ముందుజాగ్రత్తగా పై నియోజకవర్గాల్లో పోలింగ్ కు మావోయిస్టుల వల్ల ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నది. పై నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేకంగా భద్రతను ఏర్పాటుచేసింది.



పోలింగ్ కేంద్రాలుండే గ్రామాల్లో సీఆర్పీఎఫ్, ఐఎస్ఎఫ్, ఇండో టిబెటన్ సెక్యూరిటి ఫోర్స్, బార్డర్ సెక్యూరిటి ఫోర్స్ లాంటి కేంద్ర బలగాలను దింపేసింది. పోలింగ్ కేంద్రాల పరిధిలోని అడవుల్లో దాదాపు రెండువారాలుగా కూంబింగ్ జరిపించింది. గ్రామాల్లో మార్చ్ ఫాస్ట్ చేసి జనాల్లో ఆత్మస్ధైర్యాన్ని కలిగించింది. జనాలు నిర్భయంగా ఓట్లేసేలా చైతన్య పరిచింది. వీళ్ళకి లోకల్ పోలీసులు అండగా నిలబడ్డారు. దాంతో జనాల్లో కూడా ఓటింగులో పాల్గొనేందుకు ఉత్సాహం కలిగింది.



ఏదేమైనా స్వేచ్చగా ఓటింగు జరిపించేందుకు కేంద్ర ఎన్నికల కమీషన్, రాష్ట్రప్రభుత్వాలు తీసుకున్న అనేక చర్యల వల్ల ఓటింగ్ పర్వాలేదన్నట్లుగా జరిగింది. నిజానికి ఓవరాలుగానే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. దాని ప్రభావం మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపైన కూడా పడింది. ఎన్నికలను బహిష్కరించాలని, బీఆర్ఎస్, బీజేపీలను తరిమికొట్టాలని మావోయిస్టులు ఈ మధ్యే గ్రామాల్లో పెద్ద పోస్టర్లు అంటించారు. దాంతో ప్రభుత్వం అలర్టయ్యింది. ఏదేమైనా ఎలాంటి సమస్యలు లేకుండానే మావోయిస్టుల ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో పోలింగును ముగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: