అమరావతి : పవన్ కు తమ్ముళ్ళు షాకిస్తారా ?
మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని తెలుగుదేశంపార్టీ నేతలు అంగీకరించటంలేదా ? సీనియర్ల మాటలు విన్నతర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు అరెస్టు, రిమాండు నేపధ్యంలో లోకేష్ ఢిల్లీలో క్యాంపు వేశారు. లోకేష్ తో భేటీ అయ్యేందుకు కొందరు సీనియర్లు కూడా అక్కడికి వెళ్ళారు. ఈ సందర్భంగా లోకేష్ అరెస్టు వ్యవహారం చర్చకు వచ్చింది. తమ మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని చింతకాయల మీడియాతో షేర్ చేసుకున్నారు.
చింతకాయల చెప్పినదాని ప్రకారం నారా లోకేష్ కూడా అరెస్టయితే పార్టీ తరపున నారా బ్రాహ్మణితో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయించాలని డిసైడ్ అయ్యింది. తొందరలోనే స్కిల్ స్కామ్ తో పాటు ఇతర కేసుల్లో తన అరెస్టు తప్పదని లోకేష్ డిసైడ్ అయిపోయారు. ఇదే విషయాన్ని చింతకాయల స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు, లోకేష్ ఆబ్సెంటులో బ్రాహ్మణితో పర్యటనలు చేయించాలని నిర్ణయించారే కానీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఎవరు ఆలోచించలేదు.
నిజానికి జనసేన, టీడీపీలు మిత్రపక్షాలు కావు. కానీ రాజమండ్రిలో పవన్ మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే ఎన్నికలకు వెళతాయని ప్రకటించేశారు. దాంతో ఇపుడందరు ఈ రెండుపార్టీలను మిత్రపక్షాలనే అనుకుంటున్నారు. మరి మిత్రపక్షం అధినేత హోదాలో పవర్ స్టార్ అందుబాటులో ఉన్నాకూడా పవన్ ఆధ్వర్యంలో పర్యటనలు చేయాలని తమ్ముళ్ళు ఎందుకు ఆలోచించలేదు ? పైగా తొందరలోనే రెండుపార్టీల ఆధ్వర్యంలో సంయుక్త కార్యాచరణ మొదలవుతుందని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటినుండి జనసేనతో కలవటం చింతకాయల తదితరులకు ఏమాత్రం ఇష్టంలేదు. జనసేనతో పొత్తుగురించి ఎప్పుడు మాట్లాడినా చింతకాయల చాలా తక్కువచేసే మాట్లాడేవారు. పొత్తులో జనసేనకు 10 సీట్లకన్నా ఎక్కువ అవసరంలేదన్నట్లుగా మాట్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది. సో, జరుగుతున్నది చూసిన తర్వాత లోకేష్ కూడా అరెస్టయితే బ్రాహ్మణి ఆధ్వర్యంలో పర్యటనలు చేయాలని డిసైడ్ చేశారే కానీ పవన్ ఆధ్వర్యంలో పర్యటనలు చేయటానికి లోకేష్ తో సహా తమ్ముళ్ళెవరు ఇష్టపడటంలేదని అర్ధమైపోయింది.