కోస్తా : జగన్ ఇంకోళ్ళని చూసుకోవాల్సిందేనా ?
రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్ధానానికి జగన్మోహన్ రెడ్డి కొత్త అభ్యర్ధిని వెతుక్కోవాల్సిందేనా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అప్రూవర్ గా మారిపోయారు. ఇప్పటికే ఆయన కొడుకు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అరెస్టుచేసి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే.
చాలాకాలం జైల్లో ఉన్న రాఘవకు ఈమధ్యనే కోర్టు బెయిల్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ వ్యవహారం చాలా కీలకమన ఈడీ పదేపదే ఆరోపిస్తోంది. సౌత్ గ్రూప్ లో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాఘవ కీలకపాత్రదారులని ఈడీ అరోపించింది. వీళ్ళ పాత్రపై చాలా సాక్ష్యాలను ఈడీ కోర్టుకు సమర్పించింది. అందుకనే శరత్, రాఘవలు చాలా కాలం క్రితమే అరెస్టయ్యారు. ఈ కేసులో ఇఫ్పటికే మాగుంటను రెండుసార్లు ఈడీ విచారించింది. అయితే అరెస్టుమాత్రం చేయలేదు.
అలాంటిది మాగుంట సడెన్ గా ఎందుకని అప్రూవర్ గా మారిపోయారో అర్ధంకావటంలేదు. స్కామ్ లో ఎవరిపాత్ర ఏమిటనే విషయాలను తాను పూర్తిగా వివరిస్తామని మాగుంట చెప్పారని సమాచారం. ఈ కేసు చివరకు ఏమవుతుంన్నది పక్కనపెట్టేస్తే రాజకీయంగా మాగుంట చాలా బలమైన నేతనే చెప్పాలి. ఒంగోలు పార్లమెంటు నుండి ఇప్పటికి నాలుగుసార్లు గెలిచారు. 1998లో మొదటిసారి గెలిచిన మాగుంట తర్వాత 2004,09లో కాంగ్రెస్ అభ్యర్ధిగానే గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా వైసీపీ అభ్యర్ధి వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు.
తర్వాత 2019లో వైసీపీ తరపున పోటీచేసి గెలిచారు. ఇంతటి బలమైన మాగుంట కేసు కారణంగా వచ్చేఎన్నికల్లో పోటీచేసేది అనుమానమే. ఒకవేళ పోటీ చేయలేకపోతే జగన్ కొత్త అభ్యర్ధిని చూసుకోవాల్సుంటంది. వైసీపీ తరపున పోటీచేయటానికి చాలామంది గట్టి నేతలే ఉన్నారనటంలో సందేహంలేదు. కాకపోతే ఇప్పటికప్పుడు కొత్త అభ్యర్ధిని ఎంపికచేయలేరు, అలాగని మాగుంటే పోటీచేస్తారని కచ్చితంగా చెప్పలేరు. అందుకనే కొంతకాలం వెయిట్ చేసి ఏమిచేయాలో జగన్ నిర్ణయించుకోబోతున్నారు.