అమరావతి : యార్లగడ్డకు షాక్ తప్పదా ?

Vijaya


కొత్తగా తెలుగుదేశంపార్టీలో చేరిన యార్లగడ్డ వెంకటరావుకు ఇక్కడ కూడా షాక్ తప్పదనే అనిపిస్తోంది. ఎలాగంటే రాబోయే ఎన్నికల్లో యార్లగడ్డకు టికెట్ దక్కేవరకు గ్యారెంటీ లేదనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. గన్నవరంలో పోటీచేసే అవకాశం దక్కదని తేలిపోవటంతోనే యార్లగడ్డ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా గన్నవరంలో జరిగిన బహిరంగసభలో యార్లగడ్డ సైకిల్ ఎక్కారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు తనను ఎక్కడినుండి పోటీచేయమని ఆదేశించినా తాను రెడీగా ఉన్నట్లు యార్లగడ్డ చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికైతే గన్నవరంకు యార్లగడ్డను ఇన్చార్జిగా చంద్రబాబు నియమించారు.





మాటవరసకు అలాచెప్పినా యార్లగడ్డ దృష్టంతా గన్నవరంలో పోటీపైనే ఉంది. ఎలాగైనా గన్నవరంలో టీడీపీ తరపున పోటీచేసి వల్లభనేని వంశీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే యార్లగడ్డకు టికెట్ గ్యారెంటీ లేదంటున్నారు. ఎందుకంటే గన్నవరంలో పోటీకి గద్దె అనూరాధను లైనులోకి తెస్తున్నారట. గద్దె అనూరాధ అంటే కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా పనిచేశారు. విజయవాడ తూర్పు ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ రావు భార్య. రామ్మోహన్ గతంలో గన్నవరం ఎంఎల్ఏగా పనిచేశారు.





గన్నవరంలో వంశీని ఓడించాలంటే గద్దె వల్లే అవుతుంది కానీ యార్లగడ్డ వల్ల కాదని జిల్లాలోని సీనియర్లు కొందరు చంద్రబాబుకు గట్టిగా చెప్పారట. అందుకనే యార్లగడ్డతో భేటీ సందర్భంలో కూడా టికెట్ పై చంద్రబాబు హామీ ఇవ్వలేదని పార్టీవర్గాల టాక్. మరి టికెట్ పై హామీ దక్కకపోయినా యార్లగడ్డ ఎందుకు టీడీపీలో చేరినట్లు ? ఎందుకంటే వైసీపీలో ఉండలేని పరిస్ధితులను ఆయనంతట ఆయనే సృష్టించుకున్నారు కాబట్టి.





అచ్చంగా ఒక్కపుడు వంగవీటి రాధ పరిస్ధితి లాగే తయారవుతుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాధా కూడా అప్పట్లో విజయవాడ సెంట్రల్ టికెట్ దక్కలేదని వైసీపీలో నుండి టీడీపీలో చేరారు. తీరా టీడీపీలో కూడా టికెట్ దక్కకపోవటంతో చివరకు ప్రచారం చేయటానికి వరకే పరిమితమైపోయారు. రేపు యార్లగడ్డ పరిస్ధితి కూడా అలాగే తయారవుతుందని సెటైర్లు పేలుతున్నాయి టీడీపీలో. మరి యార్లగడ్డను చంద్రబాబు చివరకి ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: