హైదరాబాద్ : చంద్రబాబునే రేవంత్ ఫాలో అవుతున్నారా ?
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ చేస్తున్న పని తెలంగాణాలో రేవంత్ రెడ్డి ఒక్కళ్ళే చేస్తున్నారు. ఇంతకీ ఏపీలో వీళ్ళు చేస్తున్నదేంటి ? తెలంగాణాలో రేవంత్ చేస్తున్నది ఏమిటి ? ఏమిటంటే బెదిరింపులు దీన్నే బ్లాక్ మెయిలింగ్ అని కూడా చెప్పచ్చు. పాదయాత్రలో లోకేష్, వారాహియాత్రలో పవన్ కల్యాణ్, యుద్ధభేరిలో చంద్రబాబు ఏకకాలంలో జగన్మోహన్ రెడ్డిని పదేపదే బెదిరిస్తున్న విషయం తెలిసిందే.
టీడీపీ నేతలపై కేసులు పెడుతున్న పోలీసుల పేర్లను రెడ్ డైరీలో నోట్ చేసుకుంటున్నట్లు లోకేష్ చెప్పారు. రెడ్ డైరీ ఏమిటో ? పేర్లు నోట్ చేసుకోవటం ఏమిటో లోకేష్ కే తెలియాలి. ఇక పవన్ అయితే పెట్టుబడిదారులను, బ్యాంకులను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దని వార్నింగ్ ఇచ్చారు. పెట్టిన పెట్టుబడులన్నీ డెమోలిషన్ చేసే ప్రాపర్టీ అయిపోతుందన్నారు. మరి తన మాటలకు అర్ధమేంటో పవనే చెప్పాలి. పవన్ కు జగన్ అంటే కసుంటే జగన్ మీద తీర్చుకోవాలి కానీ పెట్టుబడులు పెట్టిన వాళ్ళమీద ఎందుకు ?
ఇక చంద్రబాబు అయితే అధికారంలోకి రాగానే జగన్ తో పాటు వైసీపీ నేతలకు అన్నింటినీ వడ్డీతో సహా తిరిగి చెల్లించేస్తామని బెదిరిస్తున్నారు. ఇబ్బందులు పెడుతున్న పోలీసులను, అధికారులు, నేతల పేర్లను రాసిపెట్టుకోమని తమ్ముళ్ళకి చంద్రబాబు చాలాసార్లు చెప్పారు. వీళ్ళ బెదిరింపులకు ట్యాగ్ లైన్ ఏమిటంటే అధికారంలోకి వస్తేనే.
సేమ్ టు సేమ్ తెలంగాణాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇదేపద్దతిలో బెదిరిస్తున్నారు. పోలీసుల పేర్లను రెడ్ డైరీలో రాసుకుంటున్నారట. ఇపుడు ప్రభుత్వం ఫైనల్ చేసిన టెండర్లను క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లు పిలుస్తారట. అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేతలకు అసలు+వడ్డీ రెండింటిని తీర్చేస్తారట. పెట్టుబడులు పెట్టేవాళ్ళు బాగా ఆలోచించుకుని పెట్టుబడులు పెట్టాలని రేవంత్ వార్నింగులిచ్చారు.
తన పాలనపై తనకు నమ్మకం ఉంటే సిట్టింగులందరికీ టికెట్లివ్వాలని చంద్రబాబు పదేపదే జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొడుతున్నారు. తన పాలనలో మంచి జరిగిందని నమ్మితే రాబోయే ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించమని జగన్ చేసిన విజ్ఞప్తిని చంద్రబాబు పట్టించుకోవటంలేదు. అదే పద్దతిలో మీ పాలనపై నమ్మకముంటే సిట్టింగులందరికీ మళ్ళీ టికెట్లివ్వమని కేసీయార్ కు రేవంత్ సవాలు విసిరారు. టికెట్లు ఎవరికివ్వాలి ? ఎవరిని దూరంగా పెట్టాలన్నది పార్టీల అంతర్గత వ్యవహారం. మరి వీళ్ళెందుకు మాట్లాడుతున్నారో అర్ధంకావటంలేదు. వీళ్ళ బెదిరింపులు ఎక్కడదాకా వెళతాయో చూడాలి.