గోదావరి : పిల్లికి ఏమైంది ?

Vijaya


జగన్మోహన్ రెడ్డి పై తిరుగుబాటు చేసిన రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కథ సుఖాంతమైనట్లేనా. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ పై పార్టీ నాయకత్వానికి పిల్లికి మధ్య వివాదం మొదలైంది. సిట్టింగ్ ఎంఎల్ఏ, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణే రాబోయే ఎన్నికల్లో కూడా పోటీచేస్తారని జగన్ తరపున ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. అప్పటికే తాను లేదా తన కొడుకు పోటీచేయటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్న బోస్ కు మండిపోయింది. అందుకనే మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడారు. దాంతో మంత్రి కూడా పిల్లికి వ్యతిరేకంగా గొంతిప్పారు.



ఇద్దరి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో నియోజకర్గం బాగా హీటెక్కింది. చివరకు పంచాయితీ జగన్ దగ్గరకు చేరటం, పిల్లికి ఫుల్లుగా క్లాసు తీసుకోవటం అందరికీ తెలిసిందే. దాంతో అలిగిన పిల్లి నాయకత్వంపై తిరుగుబాటుచేశారు. కచ్చితంగా తాను పోటీచేస్తానని, ఎంపీ పదవికి కూడా రాజీనామ చేస్తానని ప్రకటించారు. ఇదంతా చూసిన తర్వాత జగన్ వెంటనే ఎంఎల్సీ తోట త్రిమూర్తులును రంగంలోకి దింపారు. మిథున్, తోట ఇద్దరు పిల్లితో ప్రత్యేకంగా మాట్లాడారు.



వాళ్ళమధ్య జరిగిన భేటీ వివరాలు తెలీదు కానీ పిల్లి సడెన్ గా కామ్ అయిపోయారు. నాయకత్వంమీద తాను పరుషంగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పుకున్నారు. జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటానని మీడియాతో చెప్పారు. నియోజకవర్గంలో సర్వే చేయిస్తానని దాని ఫీడ్ బ్యాక్ ఆధారంగా నిర్ణయిస్తానని జగన్ చెప్పినట్లు పిల్లి చెప్పారు. మొత్తంమీద రాబోయే ఎన్నికల్లో వేణుయే పోటీచేస్తారా లేకపోతే ఇంకెవరికైనా టికెట్ ఇస్తారా అన్న విషయం సస్పెన్సుగా మారిని ఇప్పటికైతే పిల్లి కామ్ అయిపోయారు.



పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో తోట త్రిమూర్తులు పోటీచేసే అవకాశముందట. తోటది రామచంద్రాపురమే అయినా మండపేటలో గెలుపు టార్గెట్ తో జగన్ బాధ్యతలు ఇచ్చారు కాబట్టి అక్కడ పనిచేస్తున్నారు. అయితే సడెన్ గా ఇపుడు మళ్ళీ సొంత నియోజకవర్గంలో గొడవలు మొదలయ్యాయి కాబట్టి మళ్ళీ తోటను జగనే పిలిచారు. దాంతో తోట కూడా రామచంద్రాపురంలో పిల్లితో మాట్లాడారు. ఇదంతా చూసిన తర్వాత ఇటు పిల్లి అటు వేణుకి కాకుండా మధ్యలో తోట పోటీచేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: